Srisaila Dam: నిండుకుండలా శ్రీశైలం
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:24 AM
శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కృష్ణమ్మకు పూజలు చేసి గేట్లను ఎత్తనున్నారు.
నేడు గేట్లు ఎత్తనున్న సీఎం చంద్రబాబు
192.5 టీఎంసీలకు చేరిన నిల్వ
ఎగువ నుంచి భారీగా వరద
1,71,550 క్యూసెక్కుల ప్రవాహం
ఇంతముందుగా గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే రికార్డు
సాగర్‌లో 147.95 టీఎంసీల కొరత
అది నిండితేనే పులిచింతలకు నీరు
రాష్ట్రంలో 13 జిల్లాల్లో వర్షాభావం
అమరావతి/నంద్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కృష్ణమ్మకు పూజలు చేసి గేట్లను ఎత్తనున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాం నిండుకుండలా దర్శనమిస్తోంది. నీటి నిల్వ 193.40 టీఎంసీలు ఉండగా.. నీటిమట్టం 880.80 అడుగులకు చేరింది. భారీ వరద కొనసాగుతుందన్న అంచనాతో.. డ్యాం భద్రత దృష్ట్యా.. పూర్తి స్థాయిలో నిండేదాకా వేచిచూడకుండా అధికారులు గేట్లెత్తి సాగర్‌కు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు మంగళవారం రానున్నారు. ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు నంద్యాల జిల్లా సున్నిపెంటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11:.35 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. తొలుత భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకుని.. 11:50-12:10 గంటల మధ్య కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. తర్వాత శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు. ఇంజనీర్లు, డ్యాం అధికారులతో డ్యాం పరిస్థితులపై చర్చిస్తారు.
నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం రోడ్డు మార్గాన సున్నిపెంటకు వెళ్లి హెలికాప్టర్లో అమరావతికి తిరిగి వెళ్తారు. సీఎంతో పాటు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, శ్రీశైలం చీఫ్ ఇంజనీర్ ఖాదిర్, ఎస్‌ఈ వేణుగోపాల్ తదితరులు కూడా పాల్గొంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ కబీర్‌బాషా, కడప ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ, శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ప్రత్యేక బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సున్నిపెంట, శ్రీశైలం, డ్యాం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు.
సగం జిల్లాల్లో వర్షాభావం..
రాష్ట్రంలో సగం జిల్లాల్లో అంటే 13 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 92.33 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 13 శాతం తక్కువగా నమోదైంది. కోనసీమలో 72.55 మిల్లీమీటర్లకు గాను 13.2 శాతం, గుంటూరు జిల్లాలో 50.6 మిల్లీమీటర్లకు గాను 29.95 శాతం, బాపట్లలో 61.7 మిల్లీమీటర్లకుగాను 17.64 శాతం, పల్నాడులో 51.07 మిల్లీమీటర్లకు గాను 40.63 శాతం, ప్రకాశం జిల్లాలో 47.27 మిల్లీమీటర్లకు 10.94 శాతం, నెల్లూరు జిల్లాలో 49.3 మిల్లీమీటర్లకు గాను 41.7 శాతం, నంద్యాల జిల్లాలో 33.05 మిల్లీమీటర్లకు 6.56 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ కరువు ఛాయలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఖరీఫ్ ప్రణాళికలను సిధ్ధం చేయాల్సిన అవసరం ఉందని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు.
పాతికేళ్లలో రికార్డు
జూలై తొలి వారంలో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇదే ప్రథమం
శ్రీశైలం జలాశయం పాతికేళ్ల రికార్డును సొంతం చేసుకుంది. జూలైలో తొలిసారిగా మొదటి వారంలో క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్ జలాశయానికి వరద జలాలు విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1960లో చేపట్టి 1981లో జాతికి అంకితం చేశారు. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. 12 క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు, ఎడమ గట్టు కేంద్రం సామర్థ్యం 900 మెగావాట్లు. జలాశయం వరద నీటి లెక్కలు పరిశీలిస్తే.. 2009 అక్టోబరు 2న అత్యధికంగా 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. అంతేకాదు పాతికేళ్ల వరద లెక్కలు పరిశీలిస్తే.. జూలై ఆఖరి వారంలోనో, ఆగస్టు తర్వాతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం పాతికేళ్ల రికార్డుగా నిలుస్తోంది. ఈ ఏడాది కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జూన్ ప్రారంభం నుంచే వరద మొదలైంది. క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు లేకున్నా.. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. వాటి గేట్లు ఎత్తి దిగవకు వరద విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం డ్యాంను ముందే నింపేసింది. సోమవారం రాత్రి 8గంటల వరద లెక్కలు ప్రకారం డ్యాం వద్ద 1,71,550 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నీటినిల్వ 193.40 టీఎంసీలకు చేరింది. ఎగునవ జూరాల నుంచి 1,08,359 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజీ (తుంగభద్ర నది) నుంచి 63,856 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పాదన ద్వారా సాగర్‌కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి రాయలసీమ కాలువలకు 15 వేలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా అవుట్‌ఫ్లో 83,233 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర డ్యాం నుంచి ఈ నెల 10న టీబీపీ ఎల్లెల్సీ కాలువకు, సుంకేసుల బ్యారేజీ నుంచి 14న కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని కర్నూలు కలెక్టరు పి.రంజిత్‌బాషా అధ్యక్షతన జరిగిన ఐఏబీ సమావేశంలో తీర్మానం చేశారు.
సాగర్‌లో 164 టీఎంసీలు..
సాగర్ గరిష్ఠ నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 164.1 టీఎంసీల నిల్వ ఉంది. మరో 147.95 టీఎంసీలు వస్తే తప్ప నిండదు. శ్రీశైలానికి ఆ స్థాయిలో భారీ వరద వచ్చి దిగువకు వదిలితే.. సాగర్ గరిష్ట స్థాయికి చేరాక.. కిందకు పులిచింతల.. ప్రకాశం బ్యారేజీకి నీటిని వదిలే అవకాశముంది.