Share News

Ratan Tata Innovation Hub: రాజధానిలో టాటా ఇన్నోవేషన్‌ హబ్‌

ABN , Publish Date - May 14 , 2025 | 05:30 AM

అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌ప్‌లతో లక్ష ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెద్ద సంస్థల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టారు.

Ratan Tata Innovation Hub: రాజధానిలో టాటా ఇన్నోవేషన్‌ హబ్‌

ఐదేళ్లలో 20 వేల స్టార్ట్‌పల ఏర్పాటే లక్ష్యం

మహిళలు, యువతకు ప్రాధాన్యం

1,000 కోట్ల పెట్టుబడి, లక్ష ఉద్యోగాల కల్పన

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

నూతన ఆవిష్కరణకు వేదికగా, ఆధునిక టెక్నాలజీలకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా తన మానసపుత్రిక రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌)ను త్వరలోనే అమరావతిలో ప్రారంభించనున్నారు. పారిశ్రామిక దిగ్గజ సంస్థలు టాటా గ్రూప్‌, ఎల్‌ అండ్‌ టి, రేమండ్‌, అదానీ పోర్ట్సు, ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌, ఆయిల్‌ అండ్‌ నేచురుల్‌ గ్యాస్‌ (ఓఎన్‌జీసీ) కార్పొరేషన్‌, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) వంటి సంస్థలను ఒకే వేదిక మీదకు చేర్చి ఆర్‌టీఐహెచ్‌ను సమర్థవంతంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20,000 స్టార్ట్‌పలను ఏర్పాటు చేస్తారు. ఇందులో తయారీ, సాంకేతిక వ్యవసాయం, టెక్స్‌టైల్స్‌, డిజిటల్‌, క్లీన్‌ఎనర్జీ, ఆరోగ్య రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఒక్కో స్టార్ట్‌పలోనూ రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా మొత్తంగా రూ. 1,000 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తారు. ఈ స్టార్ట్‌పల్లో మహిళలకు, యువత, నైపుణ్యం కలిగినవారికి ప్రాధాన్యం ఇస్తారు. స్టార్ట్‌పలతో వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి ద్వారా పోటీతత్వంతో మార్కెటింగ్‌ చేసుకునే విధానాలలో అవగాహన కల్పిస్తారు.


ఆర్‌టీఐహెచ్‌ ముఖ్య సేవలు ఇవీ..

ఇన్నోవేషన్‌ సెంటర్‌ నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద దిగ్గజ పారిశ్రామిక సంస్థలు నిధులు సమకూరుస్తాయి.

ఆర్‌టీఐహెచ్‌ ద్వారా యువతలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం వంటి వాటిలో శిక్షణ ఇస్తారు.

పౌర సేవలందించే ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆర్‌టీఐహెచ్‌ భాగస్వామ్యం అవుతుంది.

భవిష్యత్తు టెక్నాలజీలైన క్వాంటమ్‌, ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏజీఐ) వంటి వాటిల్లో స్టార్ట్‌పలకు సహకారం అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ, ఆక్వా, మెరైన్‌ రంగాల్లోనూ సేవలు అందిస్తుంది.

టెక్స్‌టైల్‌ ఇన్నోవేషన్‌, అపెరల్‌, ప్రత్యామ్నాయ ఫైబర్‌, ఇంధనం, క్లీన్‌టెక్‌, పునరుత్పాదక ఇంధన రంగాలు, లైఫ్‌సైన్స్‌, ఫార్మా అండ్‌ హెల్త్‌ రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

పట్టణ రవాణా, సముద్ర రవాణా, సామాజిక వ్యాపారం, గ్రామీణ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు శిక్షణను ఇస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:30 AM