Share News

CM Chandrababu Naidu : ‘బనకచర్ల’పై బాబు గురి!

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:27 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దీనికి కేంద్ర నిధుల సాధనకు మరోసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.

CM Chandrababu Naidu : ‘బనకచర్ల’పై బాబు గురి!

కేంద్రం నుంచి నిధుల సాధనకు కసరత్తు

దావోస్‌ నుంచి తిరిగొస్తూ రేపు ఢిల్లీలో ఆగాలని నిర్ణయం

వీలైతే ప్రధాని మోదీని కలిసే యోచన

కేంద్ర ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులను కూడా..

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు

ఇందులో సగం కేంద్రం భరిస్తే మిగతాది ఇతర మార్గాల్లో సేకరణ

అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దీనికి కేంద్ర నిధుల సాధనకు మరోసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. దావోస్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన ఢిల్లీలో ఆగనున్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్‌ కుడికాలువ గుండా బనకచర్లకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి రాయలసీమకు తరలించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలు, మీడియా సమావేశాలు, పార్టీ సమావేశాల్లో ఇప్పటికే విపులంగా వివరించి చర్చించారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారుగా రూ.80 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన మొత్తం ఇతర మార్గాల్లో సమీకరించవచ్చని ఆయన భావిస్తున్నారు. దీనిని చేపట్టడం ఆలస్యమైనకొద్దీ అంచనా వ్యయం ఇంకా పెరిగిపోతుందని, భవిష్యత్‌లో ఇక చేపట్టలేనంతగా పెరిగిపోవచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అమరావతికి వచ్చినప్పుడు.. చంద్రబాబు విజయవాడలో ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మరీ ఓ లేఖను అందజేశారు. ఈ ప్రాజెక్టు వివరాలతో ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ‘ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు లభిస్తాయి. కరవు నుంచి రక్షణ లభిస్తుంది. సాగు ప్రాంతం పెరిగి రాష్ట్రానికి, దేశానికి ఆహార ధాన్యాల లభ్యత పెరుగుతుంది.

వెనుకబడిన రాయలసీమలో ఉద్యానవన పంటల సాగును లాభదాయకంగా మార్చడం వీలవుతుంది. ఈ లాభాల దృష్ట్యా దీనిని కేంద్ర ప్రాజెక్టుగా చేపట్టాలి’ అని లేఖలో అభ్యర్థించారు. కేంద్రం నదుల అనుసంధానాన్ని ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టినందున.. దాని కింద బనకచర్లను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి.. ఆ అనుభవంతో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో నదుల అనుసంధానం చేపట్టవచ్చని సూచించారు. దీనిపై పరిశీలన జరుపుతామని అమిత్‌ షా ఆయనకు హామీ కూడా ఇచ్చారు. అంతకు ముందు ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు ఆయనకు కూడా చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి ఆగి ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇంకోసారి కేంద్రం వద్ద ప్రస్తావించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. గురువారం రాత్రికి దావోస్‌లో ఆయన సమావేశాలు ముగుస్తాయి. శుక్రవారం (24న) ఆయన బయల్దేరి ఢిల్లీ రానున్నారు. ఆ రోజు అక్కడ ఆగి వీలైతే ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని, సంబంధిత ఇతర మంత్రులను కలవాలని నిర్ణయించారు. అవసరమైతే ఆ రాత్రి అక్కడే బస చేసి ఇంకా ఎవరినైనా కలవాల్సి ఉంటే కలిసి 25న అమరావతికి తిరిగి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈలోపు కలిసి మాట్లాడితే బడ్జెట్‌లో సదరు ప్రాజెక్టుకు కొంతయినా కేటాయింపులు చేస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. దీనితోపాటు ఏవైనా పథకాల కింద కేంద్రం వద్ద ఖర్చు కాకుండా నిధులు మిగిలిపోయి ఉంటే.. వాటిని రాబట్టుకోవడంపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద ప్రపంచ బ్యాంకు మన దేశానికి మంజూరు చేసిన రుణంలో కొంత భాగం ఖర్చు కాలేదు. కేంద్రం అనుమతిస్తే అందులో కొంత బనకచర్ల ప్రాజెక్టుకు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు.

Updated Date - Jan 23 , 2025 | 04:27 AM