Share News

CM Chandrababu: 17 నెలల్లో రూ.50,763 కోట్లు

ABN , Publish Date - Dec 01 , 2025 | 04:45 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పింఛన్లకే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు.

CM Chandrababu:  17 నెలల్లో రూ.50,763 కోట్లు

  • ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల’పై భారీ వ్యయం

  • దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం: సీఎం

  • పేదల సేవలో ప్రతి నేతా పాల్గొనాలి

  • కూటమి చేసిన మంచిని ప్రజలకు చెప్పండి

  • ఆ తర్వాత వారు మరే పార్టీకీ ఓటేయరు

  • కొన్ని చోట్ల అనర్హులకూ పింఛన్లు

  • అర్హులకు అన్యాయం జరగన్విం

  • పార్టీలకతీతంగా పెన్షన్లు ఇస్తాం

  • ఉగాదికి మరో 5 లక్షల ఇళ్లు

  • నేతలు, ప్రజాప్రతినిధులతో

  • సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

నిరంతరం ప్రజల్లో ఉంటేనే మంచి రాజకీయ నేతలుగా రాణించగలుగుతాం. టీడీపీ నేతలు, శ్రేణులు వారి కష్టనష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పింఛన్లకే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు’ దేశంలోనే అతిపెద్ద డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌-ప్రత్యక్ష నగదు బదిలీ) కార్యక్రమంగా అభివర్ణించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ప్రతి నేతా పాల్గొనాలని పిలుపిచ్చారు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏటా వృద్ధాప్య పింఛన్‌దారులకు రూ.48 వేలు, డయాలసిస్‌ రోగులకు రూ.1.20 లక్షలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు రూ.1.80 లక్షల చొప్పున అందిస్తున్నామని చెప్పారు. మరే రాష్ట్రమూ ఈ స్థాయిలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయడం లేదన్నారు. ‘పింఛన్ల పంపిణీలో మన నేతల భాగస్వామ్యం గతంలో కేవలం 16 వేలే ఉండేది. తరచూ దాని ప్రాధాన్యం వివరిస్తూ రావడం.. నేరుగా నేనూ పేదల సేవలో పాల్గొంటుండడంతో మిగిలిన నేతలు కూడా పాల్గొనడం ప్రారంభించారు. ఇప్పుడు సుమారు 25వేల మంది నాయకులు భాగస్వాములవుతున్నారు. రానున్న రోజుల్లో ఇది 35వేలకు చేరాలి’ అని ఆకాంక్షించారు. త్వరలోనే ఫ్యామిలీ బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎఫ్‌బీఎంఎస్‌) ద్వారా ఉమ్మడి కుటుంబాలకు మరింత లబ్ధి చేకూర్చే విధానం అమలు చేస్తామన్నారు. కొన్నిచోట్ల అనర్హులకు పింఛన్లు అందుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులు ఏ పార్టీకి చెందిన వారైనా అన్యాయం జరగనివ్వబోమని స్పష్టంచేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వను..

మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి చెబితే కూటమిని కాదని పక్క పార్టీలకు వారు ఓటేయరు. సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు ప్రజలతో నేతలు మమేకం కావాలి. కార్యకర్తల అభిప్రాయాల మేరకే నాయకత్వం ముందుకెళ్లాలి. 12 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు, 46వేల మంది బూత్‌ ఇన్‌చార్జులు, 8వేల మంది యూనిట్‌ వ్యవస్థల బలం పార్టీకి ఉంది. వీరంతా కలిసి కూటమి చేస్తున్న మంచిని జనంలోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలు పార్టీయే సర్వస్వంగా తమ ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేశారు. పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవిస్తున్నాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. సోమవారం నుంచి ప్రారంభమయ్యే శిక్షణ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలి. గత పాలకుల విధ్వంసంతో రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ప్రజల్లో ఇంకా చర్చ జరగాలి. రాజకీయ కక్షతో నీరు-చెట్టు, ఉపాధి హామీ బిల్లులు కూడా నిలిపివేశారు. కేంద్రంతో మాట్లాడి ఈ బిల్లులను మంజూరు చేయించారు. ఇళ్ల పథకంలోనూ నిధులను దారి మళ్లించారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తాం. అర్హుడైన ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం.

నేటి నుంచి పార్టీ డిసెంబరు క్యాలెండర్‌..

టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబరు క్యాలెండర్‌ రూపొందించాం. 1న పింఛన్ల పంపిణీ, 3న రైతుసేవా కేంద్రాల్లో వర్క్‌ షాపుల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు, 5న మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నాం. వీటన్నిటిలోనూ నాయకత్వం, కార్యకర్తలు పాల్గొనాలి.


నేడు గోపీనాథపట్నంలో సీఎం పింఛన్ల పంపిణీ

ఏలూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు డిసెంబరు 1న ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉంగుటూరు మండలం నల్లమాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన గోపీనాథపట్నం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. తిరిగి నల్లమాడుకు చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శిస్తారు. అక్కడే ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఉంగుటూరు నియోజకవర్గ మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించి సత్కరిస్తారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. ఆపై ఉండవల్లికి తిరుగుపయనమవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Justice Manavendranath Roy: సమాజాన్ని మేల్కొలిపిన గురజాడ రచనలు

Pattali Makkal Katchi: ఏపీలో వన్నియకుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ వర్గాలకు 6శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Updated Date - Dec 01 , 2025 | 08:24 AM