Justice Manavendranath Roy: సమాజాన్ని మేల్కొలిపిన గురజాడ రచనలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:34 AM
మహాకవి గురజాడ ఒక శక్తి అని, ఆయన రచనలు, గేయాలు సమాజాన్ని మేల్కొలిపాయని హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు.
హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
ఆచార్య ఇనాక్‌కు గురజాడ పురస్కారం ప్రదానం
విజయనగరం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మహాకవి గురజాడ ఒక శక్తి అని, ఆయన రచనలు, గేయాలు సమాజాన్ని మేల్కొలిపాయని హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా విజయనగరంలో ఆదివారం పీవీజీ రాజు క్షత్రియ పరిషత్ కల్యాణ మండపంలో గురజాడ సాహితీ చైతన్యోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ హాజరై మాట్లాడారు. గురజాడ రాసిన గేయాలు, పద్యాలు చదివి ఎంతో మంది మహానుభావులుగా ఎదిగారని కొనియాడారు. ఇటువంటి మహనీయుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి బబిత, కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్, గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, ఎ.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.