Share News

CM Chandrababu: జనాభా పెరగాలి

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:40 AM

కుటుంబంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంక్షేమం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: జనాభా పెరగాలి

  • ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం

  • దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గుతోంది

  • రాష్ట్రంలో జననాల రేటు 1.5 నుంచి 2.1కి చేరాలి

  • రిటైరైన వారూ పనిచేస్తే ఉత్పాదకత వృద్ధి

  • ఎస్‌ఆర్‌ఎం 10 వేల కుటుంబాలను దత్తత తీసుకోవాలి

  • పాపులేషన్‌ డైనమిక్స్‌ సదస్సులో సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంక్షేమం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అవసరమని చెప్పామని, కానీ ఇప్పుడు జనాభాను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో నిర్వహించిన ‘పాపులేషన్‌ డైనమిక్స్‌ సదస్సు’లో ఆయన మాట్లాడారు. జనాభా తగ్గిపోతే చట్టసభల్లో మన సీట్లు కూడా తగ్గుతాయని, అయితే సీట్ల కంటే దేశమే ముఖ్యమని అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుతోంది. కొన్ని దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారు. దక్షిణ భారతంలో అభివృద్ధి మెరుగ్గా ఉన్నా.. జననాల రేటు తగ్గిపోతోంది. జనాభా విషయంలో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ మనల్ని కాపాడుతున్నాయి. జపాన్‌, జర్మనీ దేశాలు జనాభా కావాలని అడుగుతున్నాయి. మన జనాభా పెరిగితే అన్ని దేశాల్లో భారతీయులు పెరుగుతారు. మరో 20 ఏళ్ల తర్వాత ఎక్కడికెళ్లినా భారతీయులే కనిపించే పరిస్థితి వస్తుంది. ఏపీలో జననాల రేటు 1.5గా ఉంటే మహారాష్ట్రలో 1.5, కేరళలో 1.4, తమిళనాడులో 1.4గా ఉంది. ఉత్తర భారతంలో ఈ రేటు మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో జననాల రేటు 1.5 నుంచి 2.1కు పెరగాలి. రిటైరైన వారు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి. రోజంతా కాకపోయినా కనీసం మూడు నాలుగు గంటలు పనిచేస్తే ఉత్పాదకత పెరుగుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


సమాజంలో ట్రెండ్‌ మారాలి..

సమాజంలో ట్రెండ్‌ మారిందని, డబుల్‌ ఆదాయం కావాలి.. పిల్లలు వద్దు అనే పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. ‘‘జనాభా పెరుగుదలపై చర్చ జరగాలి. నేనే గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని బిల్లు తెచ్చాను. ఇటీవల దాన్ని రద్దుచేశాం. భవిష్యత్తులో ఇద్దరి కంటే ఎక్కువ ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులనే చట్టం రావాలి. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పథకం అమలుచేస్తాం. గతంలో ప్రసూతి సెలవులు రెండు డెలివరీలకే ఉండేది. ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని కన్నా సెలవులిస్తాం. ఒక ఇంట్లో గరిష్టంగా 25 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధన కూడా మారుస్తాం’’ అన్నారు.

గ్లోబల్‌ లీడర్లు కావాలి

మీరంతా గ్లోబర్‌ లీడర్లుగా ఎదగాలని విద్యార్థులనుద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘నేను మారుమూల ప్రాంతంలో పుట్టాను. మా ఊర్లో 30 ఇళ్లు కూడా లేవు. కానీ.. నిరంతరం జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాను. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చాన్స్‌లర్‌ కూడా సాధారణ టీచర్‌ నుంచి యూనివర్సిటీ పెట్టే స్థాయికి ఎదిగారు. మీరు కూడా అలాగే ఉన్నత స్థానాలకు రావాలి. ఎప్పుడు నచ్చితే అప్పుడే చదవండి. కానీ చదివినప్పుడు ఏకాగ్రతతో చదవండి. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 10వేల కుటుంబాలను దత్తత తీసుకుని విద్యా, ఉపాధి పరంగా వారికి సహకారం అందించాలి’’ అని చంద్రబాబు సూచించారు.


నెలన్నరలో లక్ష కోట్ల పనులు ప్రారంభిస్తాం

రానున్న నెలన్నర రోజుల్లో అమరావతిలో రూ.లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తామని సీఎం తెలిపారు. మూడేళ్లలో ఆ నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. ‘గత ఐదేళ్లలో అమరావతిలో ఒక్క అంగుళం రోడ్డు కూడా నిర్మించలేదు. పైగా అంతకుముందు చేపట్టిన నిర్మాణాలను మధ్యలో వదిలేశారు. పేదరిక రహిత సమాజం లక్ష్యంగా ఉగాది రోజున పీ-4 విధానం ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు ఉద్యోగాలకోసం చూసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి. గ్రామాల్లో ఉండి పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం పాలసీ తీసుకొస్తున్నాం. గతంలో భార్యలు... భర్తలపై ఆధారపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలో 80 శాతం మంది భార్యల జీతాలు భర్తల కంటే ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో మహిళలకు విద్యారంగంలో 33శాతం రిజర్వేషన్‌ తీసుకొచ్చాం. భవిష్యత్తులో అబ్బాయిలకే రిజర్వేషన్‌ ఇచ్చే పరిస్థితి వస్తుంది’’ అన్నారు. సదస్సులో ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ చాన్స్‌లర్‌ టీఆర్‌ పారిందర్‌, ప్రెసిడెంట్‌ పి.సత్యనారాయణన్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 04:41 AM