Davos : నేనే సీనియర్.. దావోస్‌లో చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 23 , 2025 | 03:50 AM
‘‘ఆర్థికంగా మహారాష్ట్ర, తలసరి ఆదాయంలో తెలంగాణ బలంగా ఉన్నాయి. వీటితో పోల్చితే ఆంధ్రప్రదేశ్ చాలా కష్టపడాలి. అయినా... ప్రగతి సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన
మీడియా సమావేశంలో బాబు, ఫడణవీస్
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఆర్థికంగా మహారాష్ట్ర, తలసరి ఆదాయంలో తెలంగాణ బలంగా ఉన్నాయి. వీటితో పోల్చితే ఆంధ్రప్రదేశ్ చాలా కష్టపడాలి. అయినా... ప్రగతి సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన ‘టీమిండియా’ బృంద సభ్యులు బుధవారం రాత్రి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల కోసం రాష్ట్రాలుగా పోటీ పడుతున్నప్పటికీ... ‘టీమిండియా’గా తామంతా ఒక్కటేనని చాటిచెప్పారు. సీనియర్ నేతగా చంద్రబాబు తామందరికీ మార్గదర్శిగా నిలుస్తున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి లోకేశ్‌తోపాటు తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాల మంత్రులు, స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్, అధికారులు పాల్గొన్నారు. ‘‘దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్న నేతల్లో నేనే అత్యంత సీనియర్. 1997లోనే మొదటిసారి వచ్చాను’ అని చంద్రబాబు నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత రాష్ట్రాల మధ్య పోటీ మొదలైందన్నారు. ‘దావోస్ సదస్సులో భారత బృందానికి ఈసారి చక్కటి ఆహ్వానం, ప్రాధాన్యం లభించాయి. పార్టీలుగా వేర్వేరు అయినప్పటికీ... ఇండియా ఫస్ట్, పీపుల్ ఫస్ట్ నినాదంతో దావో్‌సకు వచ్చాం. గతంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఒకరిద్దరు కేంద్ర మంత్రులే వచ్చేవారు. ఈసారి... ప్రధాని మోదీ అత్యుత్తమ బృందాన్ని ఎంచుకుని పంపించారు’ అని చెప్పారు. గతంలో చీఫ్ మినిస్టర్స్ డైలాగ్ పేరుతో ఒకసారి సీఎంల భేటీ జరిగిందని గుర్తు చేశారు. ‘ఇది మంచి సంప్రదాయం. ప్రపంచ పరిణామాలను గమనించి, తగిన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది’ అని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ శరవేగంగా ముందుకు వెళ్తోందన్నారు. ‘ఇంక్రిమెంటల్ జీడీపీ గ్రోత్‌లో భారత్ 2028 నాటికి అగ్రస్థానంలో ఉంటుందని బ్లూంబర్గ్ అంచనా వేసింది. మోదీ నాయకత్వంలో స్థిరమైన అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్‌కు స్వర్ణయుగం మొదలైంది’ అని చెప్పారు.
దావోస్లో మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలతో బాబు
పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును.. బుధవారం అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వేదిక వద్దకు వచ్చిన మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్, రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సంబంధిత ఫొటోను చంద్రబాబు పోస్టు చేశారు. పెట్టుబడులు రాబట్టేందుకు ముఖ్యమంత్రులుగా పోటీ పడుతున్న ముగ్గురు నేతలూ కలుసుకున్న అరుదైన దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ ‘క్లిక్’మనిపించారు. ఈ చిత్రం చంద్రబాబుకు బాగా నచ్చింది. వెంటనే దానికి ‘టీమ్ ఇండియా ఎట్ ప్రపంచ ఆర్థిక వేదిక’ అనే శీర్షిక పెట్టి ‘ఎక్స్’లో విడుదల చేశారు. ’