Share News

CM Chandrababu : ఏటీఎస్‌ల ఏర్పాటుకు సీఎం ఓకే

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:37 AM

‘టెక్నాలజీకి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. అందుకు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ సెంటర్లు(ఏటీఎస్‌) ఏర్పాటు చేయండి’ అంటూ రవాణా శాఖకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరు లోపు

CM Chandrababu : ఏటీఎస్‌ల ఏర్పాటుకు సీఎం ఓకే

ఫిబ్రవరికి మొత్తం కేంద్రాలు ఏర్పాటు పూర్తి.. నేడో, రేపో జీవో జారీ చేయనున్న రవాణా శాఖ

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘టెక్నాలజీకి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. అందుకు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ సెంటర్లు(ఏటీఎస్‌) ఏర్పాటు చేయండి’ అంటూ రవాణా శాఖకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరు లోపు ఐదు కేంద్రాలు, ఫిబ్రవరి చివరికి మొత్తం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఏటీఎ్‌సల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతోంది. రోడ్డు ప్రమాదాల తగ్గింపు చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏటీఎ్‌సలు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేసింది. సుమారు ఐదేకరాల విస్తీర్ణంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఏటీఎ్‌సల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తులు టెండర్లు దక్కించుకున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అనంతపురం, నంద్యాలలో ఇప్పటికే రెండు ఏర్పాటయ్యాయి. అయితే పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్లిపోతే ప్రమాదమని, భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారంటూ ఎంవీఐలు, రవాణా శాఖ ఉన్నతాధికారుల వద్ద సందేహాన్ని లేవనెత్తారు. దీంతో పూర్తి నిర్ణయం వెలువడే వరకూ ఆగాలంటూ ఆ రెండింటినీ రవాణా శాఖ తాత్కాలికంగా ఆపింది. ‘ఎంవీఐల పాత్ర ఉన్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేం ఒక్కో కేంద్రానికి రూ.5 కోట్లు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నాం. జీఎ్‌సటీ (18 శాతం) రూపంలో సుమారు రూ.25 కోట్లు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుంది’ అంటూ ఏటీఎస్‌ టెండర్లు దక్కించుకున్న వారు సీఎంకి వివరించారు. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన చంద్రబాబు... ‘రోడ్డు ప్రమాదాల కట్టడి కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మనమెందుకు జాప్యం చేయాలి? డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన ఫిట్నె్‌సలో అధునాతన టెక్నాలజీ వస్తే మంచిదే కదా? కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం కానివ్వండి’ అంటూ ఆదేశించారు. ఈ నెల 12న సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అనంతపురం, నంద్యాలలో ఇప్పటికే ఉండగా అనకాపల్లి, కాకినాడ, గుంటూరులో నెలాఖర్లోపు పూర్తి కానున్నాయి. రాజమహేంద్రవరం, చిత్తూరు, కర్నూలులో ఫిబ్రవరిలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ప్రభుత్వమే నిర్వహిస్తుండగా భీమవరంలో సాంకేతిక సమస్యతో టెండర్‌ రద్దు అయింది. బాపట్ల జిల్లాలో వాహనాలు తక్కువగా ఉన్నందున ఏటీఎస్‌ టెండర్ల దాఖలుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.

Updated Date - Jan 17 , 2025 | 04:37 AM