Share News

CM Chandrababu Naidu: పోలవరం-బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు!

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:13 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు సంబరాలను మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోదావరి జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu Naidu: పోలవరం-బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు!

గోదావరి వృథా నీటినే కరువు ప్రాంతాలకు తరలిస్తున్నాం.. దీన్ని కూడా ఓ పార్టీ రాజకీయం చేస్తోంది

ఈ తరలింపుపై తెలంగాణ బాధపడాల్సిన అవసరం లేదు

కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎన్నడూ వ్యతిరేకించలేదు

గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు సంబరాలను మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోదావరి జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై స్పందించారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలను కరవు ప్రాంతాలకు తరలిస్తానంటే కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణలో ఉండేవారితోపాటు తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి జలాలను బనకచర్లకు తీసుకెళ్లడం వల్ల ఎవరికీ నష్టం జరగదు.

gh.jpg

వృథాగా వెళ్లే నీటినే తరలిస్తున్నాం. దీన్ని కూడా ఓ పార్టీ రాజకీయం చేస్తోంది. ఒకరు మాట్లాడితే తాము వెనకబడిపోతామని మరికొందరు మాట్లాడుతున్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి. తెలంగాణలోని కరువు ప్రాంతాలకూ నీటిని తరలించుకోవచ్చు. ఏపీ ప్రాంతానికి తరలించే నీటిపై తెలంగాణ బాధపడాల్సిన అవసరం లేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చివరి ప్రాంతంలో ఉన్న రాజమహేంద్రవరం దాటితే గోదావరి నీరు సముద్రంలోనే కలుస్తుందని గుర్తుచేశారు. చివరి ప్రాంతాలకు మిగులు జలాలను తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేశారు. గోదావరి నికర జలాల వాటా తేల్చాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - Mar 05 , 2025 | 03:13 AM