Chandrababu Interaction: సీఎం కారులో చర్మకారుడు
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:41 AM
తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లిలో చర్మకారుడు సనమండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారులకు ఇచ్చే పింఛను ఇవ్వాల్సి ఉంది.
రెండు కిలోమీటర్లు ప్రయాణం
యోగక్షేమాలు, జీవన స్థితిగతులపై మాటామంతీ
రాజమహేంద్రవరం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆయన కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లిలో చర్మకారుడు సనమండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకారులకు ఇచ్చే పింఛను ఇవ్వాల్సి ఉంది. అయితే పోసిబాబు ధర్మవరంలోని ఓ జనరల్ స్టోర్ వద్ద ఉన్నట్లు యంత్రాంగం చెప్పగా.. సీఎం నేరుగా ఆ దుకాణం వద్ద కారు ఆపి పోసిబాబును పలకరించారు. ముందు జనరల్ స్టోర్ యజమాని కొండా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వ్యాపారం సాధకబాధకాలపై ముచ్చటించారు. తర్వాత పోసిబాబును కారులో ఎక్కించుకుని తనపక్క సీటులో కూర్చోబెట్టుకున్నారు. అక్కడి నుంచి మలకపల్లికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకూ అతడి కుటుంబ నేపథ్యం, స్థితిగతులు, వృత్తి జీవితం తదితర విషయాలపై పోసిబాబును ఆరా తీశారు. గ్రామంలో చర్మకార పింఛను పొందుతున్న వ్యక్తి పోసిబాబు ఒక్కరే కావడం గమనార్హం. అనంతరం సీఎం గెడ్డం కృష్ణదుర్గ ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందజేశారు. అక్కడే తల్లి ఒడిలో ఉన్న పసిపాపను దగ్గరకు తీసుకుని ముద్దాడారు.
ఇంత అదృష్టం దక్కుతుందనుకోలేదు!
‘మా జీవితంలో ఇంత అదృష్టం దక్కుతుందని అనుకోలేదు. మా కుటుంబం ఎప్పుడో ఎంతో పుణ్యం చేసుకుంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మాకు ఇల్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఆయనే మా ఇంటికొచ్చి ఇంటిని బాగు చేయిస్తామని, మా జీవితాలను నిలబెడతామని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నాం’ అని పోసిబాబు కుటుంబం ఆనంద బాష్పాలు నిండిన కళ్లతో చెప్పిం ది. మలకపల్లికి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎస్సీ పేటలోని ఇందిరా కాలనీలోని పోసిబాబు ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా చర్మకళాకారుడికి ఇచ్చే రూ.3 వేల పింఛనును పోసిబాబుకు స్వయంగా అందజేశారు. సీఎం తన భర్త భుజంపై చేయివేసి మాట్లాడడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అతడి భార్య రామలక్ష్మి అన్నారు.
అన్నిటికీ ఓకే..
సీఎం: మీరు ఇబ్బందులు పడకుండా జీవించడానికి నేనేం చేయాలి?
పోసిబాబు: మా ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకోవాలయ్యా. ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు అప్పు చేశాను. పూర్తిగా బాగు చేయించుకోడానికి మరో రూ.1.50 లక్షలవుతుంది.
సీఎం: ఓకే. 100 రోజుల్లో ఇంటిని బాగు చేయించండి (కలెక్టర్‌కు ఆదేశం)
పోసిబాబు: నా కొడుకు మోహన్ ఐటీఐ చదివాడు. ఉద్యోగం ఇప్పించడయ్యా.
సీఎం: ఓకే.. ఇస్తాను. ఇంకా..
పోసిబాబు: నేనూ ఒక కొట్టు పెట్టుకుంటే ఉపాధికి ఇబ్బంది ఉండదయ్యా.
సీఎం: ఓకే. కొట్టు పెట్టుకునే ఏర్పాటు చేస్తా (కలెక్టర్‌కు ఆదేశం)
చెప్పుల జత, టోపీ రూ.5 వేలు: పోసిబాబుకు జీవనాధారమైన డప్పు ఇంటి బయట ఉండడం చూసిన చంద్రబాబు.. దానిని పట్టుకుని దరువేశారు. అతడు తయారుచేసితో చెప్పుల జత, టోపీని ముచ్చటపడి కొనుగోలు చేశారు. వాటి నిమిత్తం పోసిబాబుకు రూ.5 వేలు చెల్లించారు.