Share News

CM Chandrababu: అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:49 AM

క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఇప్పటికే భూమిని కేటాయించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

CM Chandrababu: అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి

  • త్వరలో డీప్‌ టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌

  • భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ప్రగతి సాధ్యం

  • ప్రముఖ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్‌’ పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు

  • క్యాన్సర్‌పై పోరుకు సలహాదారుడిగా నోరి

విజయవాడ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో త్వరలోనే ఒక క్యాన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఇప్పటికే భూమిని కేటాయించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దాన్ని ఏ విధంగా నిర్మించాలన్న దానిపై డాక్టర్‌ నోరి దత్తాత్రేయతో కలిసి చర్చిస్తామని చెప్పారు. అలాగే అమరావతికి త్వరలో డీప్‌ టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను తీసుకువస్తామని, ఈ రెండింటికీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడ టు మ్యాన్‌హ్యాటన్‌’ పుస్తకాన్ని విజయవాడలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నోరి ఫౌండేషన్‌ ద్వారా దత్తాత్రేయ ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా క్యాన్సర్‌ మహమ్మారి పడుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఏటా 40 వేల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారన్నారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం ఉండదని తెలిపారు. అవగాహన లేక చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌పై పోరులో ప్రభుత్వ సలహాదారుడిగా దత్తాత్రేయుడిని నియమిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. దత్తాత్రేయ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగారన్నారు. డాక్టర్‌ నోరి దత్తాత్రేయ జీవితం వడ్డించిన విస్తరి కాదని చంద్రబాబు అన్నారు. మారుమూల ఉన్న మంటాడలో పుట్టి తన సేవలతో ప్రపంచాన్ని మెప్పించారని కొనియాడారు.


దీనికి తెలుగు వారంతా గర్వించాలన్నారు. దత్తాత్రేయ ఎంచుకున్న రంగంలో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉండటం మామూలు విషయం కాదన్నారు. మహిళల క్యాన్సర్‌ నివారణలో ఉత్తమ వైద్యులుగా దత్తాత్రేయకు అవార్డులు వచ్చాయన్నారు. 50 ఏళ్ల వైద్య వృత్తిలో ఆయన ఎంతోమందికి ప్రాణం పోశారన్నారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకానికి క్యాన్సర్‌ వచ్చిప్పుడు అమెరికాలో దత్తాత్రేయే ఆమెకు వైద్య సేవలు అందించారన్నారు. ప్రజల కోసం క్యాన్సర్‌ ఆస్పత్రి పెట్టాలని ఆమె కోరడంతో ఎన్టీఆర్‌ దాన్ని నెలకొల్పారన్నారు. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు. క్యాన్సర్‌ అనగానే మానసికంగా కుంగిపోవడం సహజమని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అనేక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. వ్యవసాయంలో పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని... జంక్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ తినడం మానుకోవాలని సూచించారు. జీవన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 05:14 AM