Swarnandhra Vision-2047: పీపీపీతో స్వర్ణాంధ్ర లక్ష్యాలు సులువు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:55 AM
స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానం ఉత్తమ మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం పీపీపీ విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మూలధన వ్యయం పెంచేందుకు దోహదం: సీఎం చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలు సులువుగా సాధించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానమే ఉత్తమ మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం పీపీపీ విధానాన్ని విస్తృత పరచడంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పీపీపీ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ జిల్లా యూనిట్‌గా రహదారుల నిర్మాణం, పోర్టులు, వైద్యరంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో ఈ విధానం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంచేందుకు పీపీపీ దోహదపడుతుందని చెప్పారు. కేంద్రం ‘‘ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు డెవల్‌పమెంట్ ఫండ్’’ ద్వారా రాష్ట్రాలకు పీపీపీ ప్రణాళికలు రూపొందించేలా ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు. పీపీపీ విఽధానంలో భూకేటాయింపులు, సకాలంలో అనుమతులు మంజూరు చేయకపోవడం వంటి సమస్యలను అధిగమించాలని అధికారులకు సూచించారు.
1422 కి.మీ. రోడ్లకు డీపీఆర్‌లు
రాష్ట్రంలో 1,422 కిమీ పొడవైన 20 రహదారులకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ప్రాధాన్యాలను బట్టి వీటిని 8,899 కి.మీలకు పెంచే వీలుందని సీఎం సూచించారు. ఖనిజ వనరులను ఏపీఎండీసీ ద్వారా నిర్వహిస్తే రాష్ట్రం అదనంగా తొమ్మిది వేల కోట్లను పొందే వీలుందన్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఐఐసీ సహకారంతో రూ. 5,000 కోట్ల రుణాలు సేకరించాలన్నారు. సుస్థిర ఆదాయాన్ని పెంచేందుకు రాజధానిని అభివృద్ధి చేయాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..