Share News

CM Calls for Revenue Department Reforms: నాన్చొద్దు... తేల్చండి

ABN , Publish Date - Sep 17 , 2025 | 04:27 AM

ప్రజాసేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకూ మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఈశాఖపై 70శాతం అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం రెండోరోజు జిల్లా కలెక్టర్ల...

CM Calls for Revenue Department Reforms: నాన్చొద్దు... తేల్చండి

రెవెన్యూ తీరు మారాల్సిందే: సీఎం

  • సెక్రటరీలు ఇంకా రిపోర్టులు అడుగుతున్నారు

  • ప్రజలను కలెక్టర్లు ఆఫీ్‌సలకు పిలుస్తున్నారు

  • కాలయాపన పనులు వెంటనే కట్టిపెట్టండి

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌తో సమస్యలన్నీ తీరాలి

  • ప్రజాసేవలకూ రేటింగ్‌ విధానం తీసుకొస్తాం

  • కేంద్రం తరహాలో పరీక్ష పెట్టి పదోన్నతులు

  • సీనియర్‌ అధికారులూ తీరు మార్చుకోవాలి

  • కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సీరియస్‌

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజాసేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకూ మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఈశాఖపై 70శాతం అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం రెండోరోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ పనితీరును సీఎం చంద్రబాబు సమీక్షించారు. ‘‘మార్కెట్లో వస్తువు రేటింగ్‌ను చూసుకుని వినియోగదారులు కొంటున్నారు. ఇదే విధంగా ప్రభుత్వసేవలకు కూడా ఎందుకు రేటింగ్‌ ఇవ్వకూడదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ రేటింగ్‌ ఇస్తామని స్పష్టీకరించారు. కేంద్రం అధికారులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారికే పదోన్నతులు కల్పిస్తోందని, అదే విధానం రాష్ట్రంలో అమలుచేస్తామని తెలిపారు. కీలక శాఖల్లో నియామకాలకు ఐటీలో నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజాసమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ‘‘ఎవరైనా సమస్యపై దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్లు, వారి నుంచి సెక్రటరీలు రిపోర్టులు అడుగుతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆర్‌టీజీఎ్‌సలో ప్రభుత్వ సమాచారమంతా నిక్షిప్తమై ఉన్నప్పుడు మళ్లీ కింది నుంచి రిపోర్టులు కోరడం ఎందుకు? దానివల్ల కాలయాపన తప్పించి ఉపయోగం ఏముంది?’’ అంటూ రెవెన్యూ శాఖపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా కార్యాలయానికి రాకుండానే ప్రభుత్వ సేవలు అందించాలని భావిస్తుంటే.. రెవెన్యూ యంత్రాంగం మాత్రం కార్యాలయాలకు రావాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌పై మంత్రులు, కలెక్టర్లకు వచ్చేనెలలో శిక్షణ అందిస్తామని తెలిపారు. నవంబరు నుంచి జిల్లాల్లో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే కలెక్టర్ల సదస్సుకు సంబంధించిన అజెండా ఆర్టీజీఎస్‌ నుంచే వస్తుందని తెలిపారు. కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందని, సీనియన్లు కూడా తమ పనిపద్ధతులను మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఇకపై ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటాయని, ఉత్తర్వులు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయని తెలిపారు. ‘‘ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌లాంటిది తీసుకొస్తాం. నెక్స్ట్‌ జెన్‌ టెక్నాలజీ ప్రవేశపెడతాం. అవేర్‌ వ్యవస్థ 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందిస్తోంది. నవంబరులోగా డేటా లేక్‌ తీసుకువస్తాం. వచ్చే రెండేళ్లలో ఈ ఫలితాలను రాష్ట్రం చివరి అంచుల వరకు విస్తరిస్తాం. టెక్నాలజీ వినియోగంపై అక్టోబరులో మంత్రులు, అధికారులు, కలెక్టర్లకు శిక్షణ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. టెక్నాలజీలో ఎకోసిస్టమ్‌ తెస్తామని ప్రకటించారు.


క్వాంటమ్‌వ్యాలీ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాల సేకరణ

క్వాంటమ్‌వ్యాలీ భవనాల నమూనాలపై సదస్సులో కలెక్టర్ల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ నిర్మాణ సమయంలో కొందరు వెల్లడించిన అభిప్రాయాలు, ఇప్పుడు క్వాంటమ్‌వ్యాలీపై వినిపించడం లేదని ఒక కలెక్టరు వ్యాఖ్యానించారు. క్వాంటమ్‌వ్యాలీ భవన నిర్మాణ డిజైన్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మూడు వేల క్యూబిక్‌ క్వాంటమ్‌ కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలాన్ని అమరావతిలో అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం వివరించారు. క్వాంటమ్‌ వ్యాలీలో 80వేల మంది పనిచేసేలా భవనాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.

CGHM.jpg

Updated Date - Sep 17 , 2025 | 04:27 AM