CID Intensifies Investigation: పరకామణి కేసులో సీఐడీ విచారణ ముమ్మరం
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:40 AM
పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారుల బృందం తిరుమలలో విచారణ చేపట్టింది.
తిరుమలలో పోలీసులు, విజిలెన్స్ అధికారులతో చర్చ
పరకామణి, కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలన
వచ్చే నెల 2లోపు కోర్టుకు నివేదిక: డీజీ అయ్యన్నార్
తిరుమల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారుల బృందం తిరుమలలో విచారణ చేపట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, లీగల్ అడ్వైజర్ లక్ష్మణ్‌రావు, ఎస్పీ గంగాధరంతో కలిసి గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులతో మరోసారి కేసు గురించి చర్చించారు. హుండీ కానుకలు లెక్కించే పరకామణి భవనానికి చేరుకుని కానుకల విభజన, లెక్కింపు, నమోదు ప్రక్రియలను పరిశీలించారు. పరకామణిలోకి ఎంట్రీ, ఎగ్జిట్‌లను చూశారు. భద్రతా తనిఖీలు ఎలా చేస్తున్నారు? ఎవరికైనా మినహాయింపులు ఉంటాయా? ఎంత సమయం పరకామణిలో ఉండొచ్చు? వంటి అంశాలపై ఆరా తీశారు. అక్కడున్న సీసీ కెమెరాల పనితీరు, ఆ ఫుటేజ్‌ను పరిశీలించే పరకామణి కంట్రోల్ రూమ్‌నూ పరిశీలించారు. అక్కడ్నుంచి తిరుమలలోని పీఏసీ-4లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. అక్కడ వీడియో వాల్‌పై వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల లైవ్ ఫుటేజ్‌ను చూశారు. అలాగే పరకామణి కేసుకు సంబంధించి ప్రస్తుతమున్న వీడియో ఫుటేజ్‌కు అదనంగా ఏవైనా ఆధారాలున్నాయా అనే కోణంలో విచారించారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులకు ఇప్పటికే విధులు కేటాయించామని డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఇందులో భాగంగానే హుండీ కానుకల లెక్కింపు పరకామణి భవనంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండే కమాండ్ సెంటర్‌ను పరిశీలించామన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను మిగతా సభ్యులతో కలిసి సుదీర్ఘంగా విశ్లేషించామని తెలిపారు. మరికొన్ని ఆధారాలు, రికార్డులు సేకరిస్తున్నామని, డిసెంబరు 2 లోపు నివేదిక తయారు చేసి కోర్టుకు అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు నిందితులను ఎవరినైనా గుర్తించారా అనే ప్రశ్నకు.. ఆధారాలన్నీ సేకరిస్తున్నామని, ఆధారం ఉంటేనే నిందితుడిగా రికార్డు చేస్తామని తెలిపారు. సీఐడీ బృందంతో పాటు విజిలెన్స్ వీఎస్వోలు రాంకుమార్, సురేంద్ర, డీఎస్పీ విజయ్‌శేఖర్ తదితరులు ఉన్నారు.