విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ధేందుకే యువికా
ABN , Publish Date - May 31 , 2025 | 01:57 AM
విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇస్రో ఆధ్వర్యంలో యువికా (యువ విజ్ఞాన కార్యక్రమం) నిర్వహిస్తున్నట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అన్నారు.
షార్ డైరెక్టర్ రాజరాజన్ వెల్లడి
సూళ్లూరుపేట, మే 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించి యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇస్రో ఆధ్వర్యంలో యువికా (యువ విజ్ఞాన కార్యక్రమం) నిర్వహిస్తున్నట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అన్నారు. ఈ నెల 19న ప్రారంభమైన యువికా - 2025 (యువ విజ్ఞాన కార్యక్రమం) ముగింపు వేడుకలను శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఘనంగా నిర్వహించారు. 12 రోజుల పాటు షార్ కేంద్రంలో జరిగిన యువికా కార్యక్రమానికి ఏపీ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాలకు చెందిన 49 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంతరిక్ష ప్రయోగాలు, నమూన ఉపగ్రహాలు, రాకెట్ల రూపకల్పన, అంతరిక్ష పరిజ్ఞానంపై సీనియర్ శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు. ఇస్రోకు యువ ఇంజినీర్లు ఎంతో అవసరమని, రానున్న రోజుల్లో దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందని ఆర్ముగం రాజరాజన్ అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు షార్ డైరెక్టర్ క్షుణ్ణంగా సమాధానమిచ్చారు. వారిని అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు.