వీరప్పల్లె గుట్టపై వైసీపీ నేత క్షుద్రపూజలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:48 PM
పెద్ద పంజాణి మండలం వీరప్పల్లె గ్రామ సమీపంలోని ఒక గుట్టపై శనివారం రాత్రి వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబల్లి శ్రీనివాసులు క్షుద్రపూజలు నిర్వహించారు.
పెద్దపంజాణి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పెద్ద పంజాణి మండలం వీరప్పల్లె గ్రామ సమీపంలోని ఒక గుట్టపై శనివారం రాత్రి వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబల్లి శ్రీనివాసులు క్షుద్రపూజలు నిర్వహించారు. అతడితోపాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాసులు.. వైసీపీకి చెందిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపంజాణి మండలం వీరప్పల్లె గుట్టపై శనివారం రాత్రి ఎవరో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్లు పలమనేరు అర్బన్, రూరల్ సీఐలు మురళీమోహన్, పరశురాముడికి సమాచారం అందింది. వారిచ్చిన ఆదేశాలతో పెద్దపంజాణి ఎస్‌ఐ మారెప్ప తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. ఘటనా స్థలంలో పెద్దపంజాణి మండలం కెలవాతి గ్రామానికి చెందిన ఎర్రబల్లి శ్రీనివాసులు (50), అతని సోదరుడు వై.శరవణ(43), అనుచరులైన పుంగనూరు మండలం బండ్లపల్లె గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులు(47), బి.ప్రకాష్(47), సి.శ్రీనివాసులురెడ్డి(34), తవణంపల్లె మండలం సిద్దంపల్లెకి చెందిన కాణిపాకం రమేష్(30), అన్నమయ్య జిల్లా కలికిరి సమీపంలో ఉన్న బండకిందపల్లెకి చెందిన జె.సునీల్(33)లను అరెస్టు చేశారు. పుంగనూరు మండలం ఎ.కొత్తకోటకు చెందిన శ్రీనివాసులు, చౌడేపల్లెకి చెందిన వినోద్‌కుమార్, చిత్తూరు కట్టమంచికి చెందిన వెంకటేష్, ఎక్స్‌కవేటర్ యజమాని సంతో్‌షరెడ్డి, చిత్తూరుకు చెందిన ఇద్దరు స్వాములు పరారయ్యారు. అక్కడ గుప్త నిధులకోసం తవ్విన గుంతను గుర్తించారు. కారు, ఎక్స్‌కవేటర్, నాలుగు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
.