పోక్సో కేసులో యువకుడికి 20ఏళ్ల జైలు, జరిమానా
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:07 AM
దూరపు బంధువైన ఆ బాలికతో తన తల్లికి ఆరోగ్యం బాగాలేక శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో ఉందని, నిన్ను చూడాలంటోందని చెప్పాడు
చిత్తూరు లీగల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం పట్రపాళ్యం గ్రామానికి చెందిన యుగంధర్ 2021 నవంబరు 19వ తేది రాత్రి 13 ఏళ్ళ వయసున్న ఓ బాలిక తన తండ్రికోసం ఇంటివద్ద ఎదురుచూస్తుండగా గమనించాడు.దూరపు బంధువైన ఆ బాలికతో తన తల్లికి ఆరోగ్యం బాగాలేక శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రిలో ఉందని, నిన్ను చూడాలంటోందని చెప్పాడు. ఆ మాటలు నిజమని నమ్మిన బాలిక యుగంధర్‌తో పాటు ద్విచక్రవాహనంలో బయల్దేరింది.శ్రీకాళహస్తి గుడి వద్దకు తీసుకువెళ్ళిన యుగంధర్ ఆ బాలికతో తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి వివాహం చేసుకున్నాడు.23వ తేది మధ్యాహ్నం 2 గంటలకు కల్వెట్టు గ్రామం బయట ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదుచేసి యుగంధర్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు మంగళవారం చిత్తూరు పోక్సో కోర్టులో విచారణకు రాగా పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి శంకర్‌రావు నిందితుడు యుగంధర్‌కు 20 సంవత్సరాల జైలుశిక్ష, రూ.6500 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం ప్రభుత్వం తరపున చెల్లించాలని తీర్పుచెప్పారు. ఈ కేసును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి వాదించారు.