Share News

వామ్మో... స్క్రబ్‌ టైఫస్‌

ABN , Publish Date - Nov 29 , 2025 | 01:14 AM

ఇప్పటికే 379 కేసుల నమోదు

వామ్మో... స్క్రబ్‌ టైఫస్‌

చిత్తూరు రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు కారణమైన నల్లిని పోలిన కీటకం ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే కనిపించేదని, ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించడంతో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కీటకం కుడితే నల్లని మచ్చ ఏర్పడడంతో పాటు ఏడు రోజుల వరకు జ్వరం ఉంటుందని, డెంగీ తరహాలోనే తీవ్రమైన కండరాల నొప్పి, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు. రోగి లక్షణాలను బట్టి సాధారణ యాంటీబయాటిక్స్‌తో నయమవుతుందని, కొన్ని సార్లు ఐసీయూ చికిత్స అవసరమవుతుందని చెబుతున్నారు. చికిత్స ఆలస్యమైతే అవయవ వైఫల్యానికి దారి తీసి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

స్క్రబ్‌టైఫస్‌ అంటే

స్క్రబ్‌టైఫస్‌ అనేది ఒక రకమైన జ్వరం.ఇది సోకడానికి కారణమైన కీటకం నల్లిని పోలి వుంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో వున్న పొదల్లో, తోటల్లో పశువులు మేసేటప్పుడు వాటికి అంటుకునే స్క్రబ్‌టైఫస్‌ కీటకం వాటిని కడిగేటప్పుడు మనుషులను కుట్టడంతో జ్వరం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పాతబడిన మంచాలు, బొంతలు, దిండ్లు, పరుపులు, చీకటి, చెత్తాచెదారం ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవించే అవకాశమున్నందున ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇది కుట్టినప్పుడు నల్లని మచ్చ ఏర్పడి... ఏడు రోజుల వరకు జ్వరం ఉంటుంది. పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు.

చిత్తూరు ప్రాంతంలోనే 149 కేసులు

రాష్ట్రంలోనే స్క్రబ్‌ టైఫస్‌ కేసులు అధిక సంఖ్యలో చిత్తూరు జిల్లాలో నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 550 మందిని పరీక్షిస్తే 379 కేసులు పాజిటివ్‌ వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో కూడా చిత్తూరు ప్రాంతంలోనే ఎక్కువగా 149 కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన టెస్ట్‌ కిట్లు, ల్యాబ్‌ లేకపోవడంతో పరీక్షలు చేయించు కోవాలంటే వేలూరు సీఎంసీకి, లేదా తిరుపతి రుయాస్పత్రికి వెళ్లాల్సిందే. టెస్టు ఫలితాలకు సుమారు 48 గంటల సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శాంపిల్స్‌ అధికంగా ఉండడంతో రిజల్ట్స్‌ రావడానికి వారం పడుతోంది.

కేసులపై కలెక్టర్‌ ఆరా

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడారు. ఏ ప్రాంతంలో ఎక్కువగా కేసులున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

లక్షణాలు

పురుగు కుట్టిన ప్రదేశంలో నల్లగా కాలిన గాయంలా ఏర్పడుతుంది. చిన్నపాటి దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు, నీరసం, తల, కీళ్లనొప్పులతో బాధపడతారు. ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. జాగ్రత్తపడి వైద్యులను సంప్రదించకుంటే తీవ్రమైన జ్వరం, పచ్చకామెర్లు, రక్తం గడ్డకట్టడం, శ్వాసకోశ ఇబ్బుందులు తలెత్తుతాయి. మూత్రపిండాలు, మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

జాగ్రత్తలు

3 రోజులకు పైగా తీవ్రమైన జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలుంటే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి.చెత్త పేరుకుపోకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో తేమ లేకుండా పొడి వాతావరనం ఉండేలా చూసుకోవాలి.తడి దుస్తులు ధరించకూడదు. పొలాల్లో పనిచేసే వారు ఏదైనా పురుగు కుట్టినట్లు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Nov 29 , 2025 | 01:14 AM