కురవ, కురబ సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:05 AM
కురవ, కురబల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
తిరుపతి(కల్చరల్), అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి) : కురవ, కురబల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్ వద్ద ఆదివారం భక్తకనకదాస విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. రామతులసి కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్ధం భక్తకనకదాసు విగ్రహాన్ని వితరణగా ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తిమ్మప్ప భక్తకనకదాసుగా మారిన విధానాన్ని వివరించారు. అపారమైన భక్తితో వెంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందిన భక్తాగ్రేసరుడని పేర్కొన్నారు. కురవ, కురబ కమ్యూనిటీ భవన నిర్మాణానికి అసవరమైన స్థలం కేటాయింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ భక్తకనకదాసు భక్తికి వెంకటేశ్వరస్వామి మెచ్చి తనకు సమర్పించిన వస్ర్తాన్ని ఆయనకు స్వయంగా అలంకించారని తెలిపారు. అటువంటి భక్తా శ్రేష్ఠుడి కాంస్య విగ్రహం తిరుపతిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే రేవన్న మాట్లాడుతూ కమ్యూనిటీ భవన నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కురవ, కురబల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. బెంగుళూరులోని కనకదాసు మఠం పీఠాధిపతి సిద్ధరామానంద స్వామి మాట్లాడుతూ భక్తి ఎక్కడుంటే కనకదాసు అక్కడుంటారని తెలిపారు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ మాట్లాడారు. అంతకుముందు బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీగా ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్దకు చేరుకున్నారు. కురవ, కురబ సంఘం నేతలు, విగ్రహావిష్కరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.