మహిళా శక్తి.. దేశానికి ప్రగతి
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:08 AM
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి.. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వేదికగా నిలిచింది. దేశనలుమూలలనుంచి మహిళా సాధికారత కమిటీ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రముఖులు హాజరవడంతో తిరుపతి ఒక చారిత్రక ఘట్టానికి ఆతిథ్యమిచ్చింది.
చారిత్రక ఘట్టానికి తిరుపతి అపూర్వ వేదిక
నగరంలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు
తిరుపతి, సెప్టెంబరు14(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి.. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వేదికగా నిలిచింది. దేశనలుమూలలనుంచి మహిళా సాధికారత కమిటీ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రముఖులు హాజరవడంతో తిరుపతి ఒక చారిత్రక ఘట్టానికి ఆతిథ్యమిచ్చింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ‘వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సు ఆదివారం రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైంది. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులు.. వాటిని అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై చర్చించారు. ‘మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్ర, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని సదస్సును ప్రారంభించిన ఓం బిర్లా స్పష్టంచేశారు. గ్రామపంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరగాలని సూచించారు. భారత రాజ్యాంగం మహిళల హక్కులకు బలమైన పునాదులు వేసిందని రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. మహిళా స్వశక్తీకరణపై లోతైన చర్చలకు ఈ సదస్సు ముఖ్య వేదికగా నిలిచిందన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగం భాగం ఇచ్చే చట్టం చేశారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు కల్పించారని, ప్రతిభా భారతి స్పీకర్‌గా నియమించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రస్థాయి మహిళా సాధికారత కమిటీలను పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీతో కలిపి పవిత్ర క్షేత్రమైన తిరుపతిలో ఈ సమావేశం నిర్వహించడం చారిత్రాత్మకమైన ఘట్టమని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఒక మైలురాయి అని, అయితే భవిష్యత్తులో రిజర్వేషన్ల అవసరం లేకుండా మహిళలు 50శాతం కంటే ఎక్కువ ప్రాతినిధ్యం పొందే రోజు రావాలని తాను కోరుకుంటున్నానన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి భారతదేశ జాతీయ వ్యూహంలో ఒక ముఖ్యమైన అంశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారని పార్లమెంటు మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విద్య, పారిశ్రామికత, ఆరోగ్యం, డిజిటల్ అక్షరాస్యత ద్వారా మహిళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గృహ హింస చట్టం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటి చట్టాలను సమర్థంగా అమలు చేయాలని కోరారు. మహిళలు, పిల్లల రక్షణ, దివ్యాంగుల సాధికారత, వయోవృద్ధుల భద్రత కోసం కలిసి పనిచేయాలని రాష్ట్ర మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడం,‘డెవలప్మెంట్ నీడ్స్ ఉమెన్’ నినాదంతో పరిపాలన చేస్తున్నారని ప్రశంసించారు. తల్లికి వందనం, దీపం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పాటు పెన్షన్లు, ప్రసూతి సాయం, రైతు కేంద్రిత ప్రయోజనాలు మహిళలకు మేలు చేస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఏఐ, బయోటెక్నాలజీ, డిజిటల్ ఎకానమీలో మహిళలు వెనుకబడకూడదని తమ ప్రభుత్వం డిజిటల్ లిటరసీ, నైపుణ్యాధికార విద్య, క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త నైపుణ్యాలలో పెట్టుబడులు పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల డెలిగేట్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. కూటమి నేతలు పాల్గొన్నారు.
చంద్రగిరి కోటలో అతిథులకు విందు
చంద్రగిరి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సదస్సుకు హాజరైన డెలిగేట్లకు చంద్రగిరి కోటలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఇందులో భాగంగా చంద్రగిరి కోట విశేషాలను తెలియజేసే సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని సభ్యులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోట ఆవరణలో ప్రదర్శించిన కుంభకోయ, థింసా, గంగజాతర నృత్యం, కూచిపూడి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతిథులకు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, భూమా అఖిలప్రియ, బొజ్జల సుధీర్‌రెడ్డి, గురజాల జగన్మోహన్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్‌రెడ్డి, టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కమిషనరు మౌర్య, అసిస్టెంట్ కలెక్టర్ సందీప్ రఘువంశీ, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాష్‌రెడ్డి, టూరిజం టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, ఏపీ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, ఇతర అధికారులు సిబ్బంది, స్వాగతం పలికారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.