మహిళలు స్వయం ప్రకాశకులుగా ఎదగాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:33 AM
మహిళలు ఒకరిమీద ఆధారపడే అవసరం లేకుండా స్వయంప్రకాశకులుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆకాంక్షించారు.
నారా భువనేశ్వరి
కుప్పం/కుప్పం రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఒకరిమీద ఆధారపడే అవసరం లేకుండా స్వయంప్రకాశకులుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఆమె, పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున 48 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి ఆసక్తులు, ఉపాధికోసం ఎంచుకున్న మార్గాల గురించి ఆరా తీశారు. చురుగా, చైతన్యవంతంగా ఉన్న మహిళలను భుజం తట్టి ప్రశంసించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు తరఫున కుప్పంలో స్కిల్ డెవల్‌పమెంట్ పథకం ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం కుట్టు శిక్షణ మాత్రమే కాకుండా పలు అంశాల్లో మహిళల ఆసక్తిని బట్టి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఇలా కుట్టు శిక్షణ పొందిన మహిళలకు, ప్రస్తుతం కుట్టు మిషన్లను కూడా ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. అలాగే పేదలైన చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశామన్నారు.ఇంకా కూడా ట్రస్టు ద్వారా అనేక స్కిల్ డెవల్‌పమెంట్ కార్యక్రమాలు నిర్వహించి, స్వయం ఉపాధిలో మహిళలకు చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కుప్పం మండలం నాయనూరు, దాసేగౌనూరులో గ్రామాలలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్న ఆమె, వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం కూడా మహిళలు స్వయం శక్తులుగా ఎదగాలన్నదే అన్నారు.అంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను భువనేశ్వరి సందర్శించారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారికి నామకరణం
నారా భువనేశ్వరి తన పేరుతోనే ఒక చిన్నారికి నామకరణం చేశారు. కుప్పం నియోజకవర్గ వన్యకుల క్షత్రియ యువత అధ్యక్షుడు సతీశ్, సత్య దంపతుల ద్వితీయ కుమార్తె నారా భువనేశ్వరి జన్మ నక్షత్రమైన పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినట్లు వారికి పురోహితుడు తెలిపారు. దీంతో ఆ చిన్నారిని దంపతులు కుప్పం పర్యటనలో ఉన్న ఆమె వద్దకు శనివారం తీసుకువచ్చి నామకరణం చేయాల్సిందిగా కోరారు. దంపతుల కోరిక మేరకు చిన్నారికి భువనేశ్వరి అని నామకరణం చేశారు.