ధరలేక.. కోయలేక..
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:59 AM
మునుపెన్నడూలేని విధంగా మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టాలబాట పట్టారు. మండలంలో 4,500 ఎకరాల్లో తోటలున్నాయి. దాదాపు 1,500మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. 30 ఏళ్ల క్రితం వరకు పైసా పెట్టుబడిలేకుండా ఏడాదికోమారు లాభాలు ఆర్జించేవారు.
మామిడి రైతు వెతలు ఇన్నన్నికావయ్యా..
రామచంద్రాపురం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): మునుపెన్నడూలేని విధంగా మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టాలబాట పట్టారు. మండలంలో 4,500 ఎకరాల్లో తోటలున్నాయి. దాదాపు 1,500మంది రైతులు ఈ పంటపై ఆధారపడ్డారు. 30 ఏళ్ల క్రితం వరకు పైసా పెట్టుబడిలేకుండా ఏడాదికోమారు లాభాలు ఆర్జించేవారు. ఐదేళ్లుగా సాగు నిర్వహణ భారం పెరిగింది. ఎకరా సాగుకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం టన్ను రూ.4వేలకు అమ్మినా పెట్టుబడి రాని పరిస్థితి. మరోపక్క కూలీలు దొరకడంలేదు. పొరుగు మండలాల నుంచి రప్పిస్తున్నారు. ఏదో బాధపడి కోయించినా రవాణా తలనొప్పిగా తయారైంది. ట్రాక్టర్‌లో రెండున్నర టన్నుల కాయలు మాత్రమే తరలించే వీలుంది. రవాణా, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి రూ.11వేలు అవుతున్నాయి. వ్యయప్రయాసలకోర్చి తరలించినా జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రెండు మూడు రోజులు నిరీక్షణ తప్పడంలేదు. దీనికితోడు ట్రాక్టర్‌కు రోజు వెయిటింగ్ ఛార్జీ రూ.2వేల నుంచి రూ.3వేలు ఇవ్వాల్సి వస్తోంది. ఈలోగా కాయ పక్వానికి వచ్చి ట్రాక్టరులోనే మాగిపోతున్న పరిస్థితి దాపురిస్తోంది. ఇన్ని వెతలు పడలేక కొందరు రైతులు కాయలు కోయకుండా వదిలేస్తున్నారు. ప్రస్తుతం మండలంలో దాదాపు 3వేల ఎకరాల పంట ఇలాగే చెట్లపై ఉండిపోయింది. రామచంద్రపురానికి చెందిన బొడ్డు దొరస్వామినాయుడు తిరుచానూరు మండీలో కొంత పైకం తీసుకున్న పాపానికి రెండున్నర టన్నుల పంట తరలించారు. ఇతనికి రూ.9,994 బిల్లు వేసి, రూ.1,294 తిరిగి చెల్లించాలని చెప్పడంతో ఆయన తెల్లబోయారు. మరో రైతు పెద్దబ్బనాయుడు తన 18ఎకరాల తోటలో కాయల్ని కోయకుండా వదిలేశారు. ఏటేటా ఈ కష్టాలు భరింలేక తనతోపాటు 12మంది గంగిరెడ్డిపల్లిలో 60 లేత మామిడిచెట్లను నరికేశారని భాస్కర్‌నాయుడు అనే రైతు ఆవేదనతో చెప్పారు.
మారని తీరు..రైతుల బేజారు
గుజ్జు పరిశ్రమలు, ర్యాంపుల వద్ద అవస్ధలు
పాకాల, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడికాయలు అమ్ముకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. గుజ్జు పరిశ్రమల యజమానులు, సప్లయర్లు, వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి చుక్కలు చూపిస్తున్నారు. గుజ్జు పరిశ్రమల వద్ద టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. ర్యాంపుల వద్ద పరిమితంగా కొనుగోలు చేస్తుండడంతో అల్లాడుతున్నారు. మండీల్లో కొందరు టన్ను తోతాపురి రూ.2వేల నుంచి 2,500కు కొనుగోలు చేస్తున్నారు. కోతకూలి, రవాణా ఖర్చులు రాకున్నా రైతులు గత్యంతరం లేక అమ్మేస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ టన్నుకు రూ.4వేలు వస్తుందనే ఆశతో గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేయడానికి రైతులు మొగ్గుచూపుతున్నారు. అక్కడ వారం పది రోజుల వరకు టోకెన్లు ఇచ్చేశామని చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని రోజులు వేచి చూస్తే తోటల్లో కాయలు పనికిరావంటున్నారు. మరోవైపు టేబుల్ మామిడి రకాలకు సైతం ధరలు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. నాణ్యతగల నీలం కాయలు టన్ను రూ.15వేలకు వ్యాపారులు కొంటున్నారు. అందులో పడే చిన్నసైజు కాయలు టన్ను రూ.2 వేలకు అమ్ముడుపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్, ఉద్యానశాఖ అధికారులు రైతులను ఆదుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. గుజ్జు పరిశ్రమల యజమానులు, సప్లయర్లు, వ్యాపారుల సిండికేటు తీరు మారడంలేదు. ఇప్పటికయినా జాప్యం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టి తోతాపురి మామిడికాయలు కొనుగోలు చేసేలా చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఙప్తి చేస్తున్నారు.
1,501.875 మెట్రిక్ టన్నుల తోతాపురి సేకరణ
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం 1,501.875మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని గుజ్జు పరిశ్రమలు సేకరించినట్లు జిల్లా ఉద్యానశాఖాధికారి దశరఽధరామిరెడ్డి తెలిపారు. నవ క్వాలిటీ ఫుడ్స్(ఎర్రావారిపాళెం) వేచి ఉండాల్సిన సమయం 15గంటలు, రాసా ఫుడ్స్ (బీఎన్‌కండ్రిగ) 24గంటలు, లియాన్ ఫుడ్స్(పుత్తూరు) 10గంటలు. టాసా ఫుడ్స్(నారాయణవనం) 16గంటలు, శ్రీవర్ష ఫుడ్స్(రేణిగుంట) 2గంటలు, శ్రీదేవరాజు ఆగ్రో ఫుడ్స్(కేవీబీపురం) 18గంటలు, క్యాప్రికాన్(సత్యవేడు) 18 గంటలు, సుప్రీం క్వాలిటీ ఫుడ్స్ (పాకాల) 30నుంచి 40గంటలపాటు వాహనాలు వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.