Share News

దిక్కు తోచక.. నష్టాలు భరించలేక!

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:24 AM

ఏడాదికోమారు సిరులు కురిపించిన మామిడి ఐదేళ్లుగా రైతులను నట్టేట ముంచింది. దీంతో దిక్కుతోచక, ఆ నష్టాలను భరించలేక ఈ ఏడాది వంద ఎకరాల్లో మామిడిచెట్లను నరికేశారు.

దిక్కు తోచక.. నష్టాలు భరించలేక!
మామిడి చెట్లను నరికేస్తున్న కూలీలు

వంద ఎకరాల్లో మామిడి చెట్లు నరికేసిన రైతులు

ఏడాదికోమారు సిరులు కురిపించిన మామిడి ఐదేళ్లుగా రైతులను నట్టేట ముంచింది. దీంతో దిక్కుతోచక, ఆ నష్టాలను భరించలేక ఈ ఏడాది వంద ఎకరాల్లో మామిడిచెట్లను నరికేశారు.

- రామచంద్రాపురం, ఆంధ్రజ్యోతి

సంప్రదాయ పంటలైన వరి, వేరుశనగ, చెరకు, చిరుధాన్యాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో గిట్టుబాటు లేకపోవడంతో సాగు తగ్గించేశారు. క్రమేణా మామిడి తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించారు. రామచంద్రాపురం మండలంలో 30 ఏళ్ల క్రితం వరకు వెయ్యి ఎకరాల్లో మామిడితోటలు ఉండేవి. ఉపాధి హామీ పథకంలో వంద శాతం సబ్సిడీ ఇవ్వడంతో ప్రస్తుతం 4,500 ఎకరాల్లో సాగయ్యాయి. గత ఐదేళ్లుగా మామిడి తోటలకు మూడు నుంచి నాలుగు దఫాలుగా మందులు పిచికారీ చేస్తే తప్ప పూత నిలవని పరిస్థితి. దీంతో పాటు ధరలు పడిపోయి తోటల్లో కాపు వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది. నాణ్యమైన మందులు లేకపోవడంతో కాపు కాయలేదని రైతులు అంటున్నారు. ఒకవేళ కాపు వచ్చినా కాయ పక్వానికి వచ్చిన దశలో పురుగులు పడి చెడిపోతున్నాయంటున్నారు. 200 ఏళ్ల నాటి చెట్లు బాగున్నా.. గత 25ఏళ్లలో నాటినవి కాపు కాయక కొమ్మలు ఎండిపోతున్నాయి. ఇలా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి.. పెట్టుబడి కూడా రాకపోవడంతో చెట్లు తొలగించడమే మార్గంగా భావిస్తున్నారు. ఈ ఏడాది గంగిరెడ్డిపల్లి, కమ్మకండ్రిగలో పలువురు రైతులు దాదాపు వంద ఎకరాల్లో మామిడి చెట్లను నరికేశారు. ఒక్కో చెట్టును సైజును బట్టి రూ.500 నుంచి రూ.1,300లోపు వ్యాపారులకు అమ్మేశారు. ఇలా మండలంలోని పలు గ్రామాల రైతులు చెట్లు తొలగించడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.

చెట్లను తొలగించడమే మార్గం

25 ఏళ్ల కిందట 5 ఎకరాల్లో మామిడిచెట్లను నాటాను. పదేళ్ల పాటు కాపు బాగానే వచ్చింది. ఎరువులు, దున్నకం, మందులు, సాగు ఖర్చు కూడా ఎకరాకు రూ.25 వేలనుంచి రూ.30వేలు అవుతోంది. దిగుబడి లేకపోవడంతో పాటు పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి. ఐదేళ్లల్లో రూ.5లక్షలు అప్పుల పాలయ్యాను. దీంతో మామిడిచెట్లను తొలగించేస్తున్నాను.

- హరినాథ్‌రెడ్డి, రైతు, గంగిరెడ్డిపల్లి

ఏటా నష్టాలు వస్తుండటంతో..

30 ఏళ్ల పాటు ఎంతో ఆప్యాయంగా మామిడిచెట్లను పెంచా. ఏటా నష్టాలు వస్తుండటంతో ఏం చేయాలో దిక్కు తోచడంలేదు. పొలంలో మామిడి చెట్లు అమ్మాలన్నా బాధేస్తోంది. ఒక్కో చెట్టును వ్యాపారులు రూ.500 నుంచి రూ.వెయ్యికి కొంటున్నారు.

- రాజేష్‌, రైతు, గంగిరెడ్డిపల్లె

Updated Date - Jun 26 , 2025 | 01:24 AM