ఈసారైనా వస్తారా?
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:31 AM
జిల్లా విభజన తర్వాత జడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని సభ్యులు సమస్యలపై ఎవరితో చర్చించాలో తెలియని పరిస్థితి నెలకొంది.
చిత్తూరు రూరల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా విభజన తర్వాత జడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు గైర్హాజరవుతున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని సభ్యులు సమస్యలపై ఎవరితో చర్చించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదో ఒకటి రెండు సమావేశాలకు రాకుంటే ఏదో పని ఉందని అనుకోవచ్చు. కానీ ప్రతి సమావేశానికీ వారు రావడం లేదు. దీనిపై ఇదివరకే సర్వసభ్య సమావేశంలో గైర్హాజరైన జిల్లాస్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మినించారు. అయినా వారి తీరు మారలేదు. గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశానికి కానీ, సర్వసభ్య సమావేశానికి కానీ హాజరు కాలేదు. దీంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన సభ్యుల్లో చాలామంది వెళ్లినా వారి సమస్యలు విని పరిష్కరించే అధికారులు లేకపోవడంతో సమావేశానికి రావడం మానుకున్నారు.
ఎక్కడి సమస్యలు అక్కడే...
జిల్లా పరిషత్‌లో దాదాపుగా జడ్పీటీసీలందరూ కూడా వైసీపీకి చెందిన వారే కావడంతో వీరు ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని సభలోనే ఆరోపిస్తున్నారు. మండలాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, మండలాధికారులు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభలో గొంతుచించుకొని సమస్యలను విన్నవించినా అవి జరగడం లేదని సభ్యులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక సభకు వెళ్లేది ఎందుకని అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేలు హాజరవుతారా?
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకట్రెండు జడ్పీ సమావేశాలకు తప్ప కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం లేదు. గత సమావేశానికి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలే హాజరయ్యారు. జిల్లా అధికారులు ఎలాగూ రారు కనీసం తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలకైనా విన్నవించుదామనుకున్నా వారు సమావేశాలకు రావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారా అని చూడాల్సి ఉంది.