ఈ రైతుల రాత మారదా?
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:38 AM
వైసీపీ హయాంలో సోమల మండలం ఆవులపల్లెలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు అడ్డుపడుతున్న రైతుల్ని ఇబ్బంది పెట్టారు. 55 మంది రైతులకు చెందిన 911 ఎకరాల పట్టా భూముల్ని నిషేధిత జాబితాలోకి ఎక్కించేశారు. అదనంగా వారిపై కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వం మారి ఏడాది దాటినా ఆ బాధిత రైతులకు న్యాయం జరగలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఆవులపల్లె వద్ద సీతమ్మ చెరువు కట్టను తెంచి ఆ స్థానంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములు, అనేక గ్రామాలు నీట మునుగుతాయని... వేలాది మామిడి, కొబ్బరి, సపోటా చెట్లు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ రైతుల రాత మారదా?
రిజర్వాయర్‌ను అడ్డుకున్నారని
55మంది ఆవులపల్లెవాసులపై కక్షసాధింపు
60ఏళ్ల నాటి సెటిల్‌మెంట్ భూములను
22ఏ జాబితాలోకి ఎక్కించిన వైసీపీ నేతలు
ప్రభుత్వం మారినా బాధితులకు దక్కని న్యాయం
పుంగనూరు, ఆంధ్రజ్యోతి
వైసీపీ హయాంలో సోమల మండలం ఆవులపల్లెలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు అడ్డుపడుతున్న రైతుల్ని ఇబ్బంది పెట్టారు. 55 మంది రైతులకు చెందిన 911 ఎకరాల పట్టా భూముల్ని నిషేధిత జాబితాలోకి ఎక్కించేశారు. అదనంగా వారిపై కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వం మారి ఏడాది దాటినా ఆ బాధిత రైతులకు న్యాయం జరగలేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఆవులపల్లె వద్ద సీతమ్మ చెరువు కట్టను తెంచి ఆ స్థానంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములు, అనేక గ్రామాలు నీట మునుగుతాయని... వేలాది మామిడి, కొబ్బరి, సపోటా చెట్లు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీతమ్మ చెరువు వెనుక భాగంలో ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వ భూమిలో రిజర్వాయర్ నిర్మించాలని కోరారు. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సంస్థ పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్సు వారు మాత్రం అదే స్థలంలో నిర్మిస్తామని పట్టుపట్టి భయానక వాతావరణం సృష్టించారు.నీటి ముంపునకు గురయ్యే కొన్ని పొలాలతో పాటు గుట్టలు, చెట్లను చదును చేసేశారు.
ఫ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారని రైతులపై కక్ష సాధింపు
భూములు పోగొట్టుకున్న ఆవులపల్లె రైతులు 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదు చేశారు.అప్పటి నుంచి ఆవులపల్లె పంచాయతీకి చెందిన ఆవులపల్లె, బయ్యారెడ్డిపల్లె, చిన్నదేవళకుప్పం, పెద్దదేవళకుప్పం, మల్లేశ్వరం, రామకృష్ణాపురం రైతులకు పోలీసు, రెవెన్యూ, జలవనరులశాఖ, అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎన్జీటీకి ఫిర్యాదు వెళ్లిన వారం నుంచి తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలు తదితర వేధింపులతో పాటు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు మొదలయ్యాయి.చివరకు పర్యావరణ అనుమతులు లేకుండానే రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ ప్రభుత్వానికి రూ.100 కోట్లు భారీ జరిమానా విధించింది. ఆవులపల్లెతో పాటు పుంగనూరు మండలంలోని నేతిగుట్లపల్లె, అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు ప్రాంతాల్లో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని 2023 మే 11వతేది సంచలన తీర్పు ఇచ్చింది.దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా వెంటనే రూ.25 కోట్లు కృష్ణాబోర్డుకు చెల్లించాలని ఆదేశించింది.చివరకు రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆగిపోయాయి.దీంతో పనులు ఆపేయించిన రైతులపై వైసీపీ నేతలు అధికారుల ద్వారా కక్ష సాధింపు మొదలు పెట్టారు.ఎన్జీటీ ఆదేశాలు వచ్చేటప్పటికే నేతిగుట్లపల్లె, ముదివేడు ప్రాంతాల్లో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు 75శాతం పూర్తయిపోయాయి.పొలాలు కోల్పోయిన రైతులు పరిహారం అందక, వ్యవసాయమూ చేసుకోలేక పూర్తిగా నష్టపోయారు.
911 ఎకరాల పట్టా భూములు నిషేధిత జాబితాలోకి..
సదుం మండలం పచ్చార్లమాకులపల్లెకు చెందిన అప్పిరెడ్డి శ్రీహరి 2023లో కర్నూలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.ఆవులపల్లె పంచాయతీలోని సర్వే నెంబరు 37 తదితర నెంబర్లలోని 911.34 ఎకరాలు ప్రభుత్వ భూములని, వెంటనే వాటిని నిషేధిత జాబితా 22ఏ (1)(బీ)లో చేర్చాలని కోరారు. దీంతో లోకాయుక్త ఆదేశాలతో నాటి కలెక్టర్ నంగిలి షన్మోహన్ సర్వే నెంబర్లు 33/1, 39, 41, 45, 46, 47, 49, 59, 55. 60. 63, 64, 60, 71, 71, 73, 76లోని 55 మంది రైతులకు చెందిన 911.44 ఎకరాలు 22ఏ జాబితాలో చేర్చాలని 2023 డిసెంబరు 14వ తేది ఉత్తర్వులిచ్చారు.ఎన్జీటీకి ఫిర్యాదు చేశారన్న కక్షతోనే అధికారం అండగా వైసీపీ నేతలు ఇలాంటి ఉత్తర్వులు ఇప్పించారని రైతులు వాపోతున్నారు. కానీ ఈ విషయం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వెలుగు చూసింది.
పోరాడుతున్నా.. రైతులకు దక్కని న్యాయం
60 ఏళ్లుగా శిస్తు చెల్లిస్తున్న సెటిల్‌మెంట్ భూముల్ని నోటీసులు ఇవ్వకుండా ఫారెస్టు భూములంటూ ట్రెంచ్‌లు తీసి బోర్డులు పెట్టారని అప్పట్లో రైతులు ఆవేదన చెందారు. తమ భూముల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ద్వారా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సీసీఎల్‌ఏ, కలెక్టర్, ఆర్డీవోలను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. గత ఏడాది ఆగస్టు 5న మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆవులపల్లెను సందర్శించి రైతులకు న్యాయం చేస్తానని, సీతమ్మ చెరువు గతంలాగే మారుస్తామని హామీ ఇచ్చారు. తర్వాత జేసీ విద్యాధరి, ఆర్డీవో ఆవులపల్లె వెళ్లి విచారించి రావడం తప్ప న్యాయం జరగలేదు.
ఫ అమలు కాని హామీలు
రిజర్వాయర్ల పనులాగిపోవడంతో ఆవులపల్లె వద్ద ఉన్న కమ్మి తదితర నిర్మాణ సామగ్రిని తరలించడానికి గతంలో రెండు మార్లు పీఎల్‌ఆర్ ప్రాజెక్టు వారు ప్రయత్నించారు. అయితే బాధిత రైతులు అడ్డుకుని తెగ్గొట్టిన సీతమ్మ చెరువు నిర్మించాలని, తమ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని పట్టుబట్టగా అధికారులు హామీలిచ్చారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఒత్తిడితో కలెక్టర్ సుమిత్‌కుమార్ బాధిత రైతులను విచారించి, సీసీఎల్‌ఏకు నివేదిక పంపుతానని, ఉత్తర్వులు రాగానే 1బీ, అడంగల్ ఇస్తామని హామీ ఇచ్చారు.అయినప్పటికీ ఇంతవరకూ వారికి న్యాయం జరగలేదు.ఈ విషయమై సోమల ఇన్‌చార్జి తహసీల్దార్ మధుసూదన్‌ను అడగ్గా పలుమార్లు ఆర్డీవో, జేసీ భూములు పరిశీలించారన్నారు. 911 ఎకరాల వ్యవసాయ భూముల 1బీ సమస్యపై విచారించి ఆర్డీవో ద్వారా కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆ భూములపై చర్యలు తీసుకుంటామన్నారు.
మా భూముల్లోకే వెళ్లనిచ్చేవారు కాదు
ఆవులపల్లె పంచాయతీలో మాకు 35 ఎకరాలు భూముండేంది.అన్యాయంగా మాలాంటి టీడీపీ సానుభూతిపరుల భూములను అప్పటి తహసీల్దార్ శ్యాంప్రసాద్‌రెడ్డి నిషేధిత జాబితాలో పెట్టారు.చివరకు మా భూముల్లోకి వెళ్లాలన్నా పీఎల్‌ఆర్ కాంట్రాక్టర్ మనుషులు వెంబడిస్తూ బెదిరించేవారు.ఎన్జీటీకి ఫిర్యాదు చేశాక నాపై ఫారెస్టు, పోలీసు తప్పుడు కేసులు పెట్టారు.ప్రభుత్వం మారినా ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు.
- సోంపల్లె లక్ష్మీపతినాయుడు, చిన్నదేవళకుప్పం
1బీ రాక బ్యాంకు రుణాలు రావడం లేదు
రిజర్వాయర్ వచ్చిందిలేదు కానీ మా పట్టా భూములను తహసీల్దార్ ప్రభుత్వ భూమిగా మార్చేశారు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ లీడ్, డాక్యుమెంట్లు, గతంలోని టెన్‌వన్, అడంగళ్లు అన్నీ ఉన్నాయి. మా ఆధీనంలోనే మా భూముల్లో సేద్యం చేస్తున్నాం.అయితే పంటల సాగుకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. మీ భూములు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయంటున్నారు.సీఎం చంద్రబాబు మా భూములను గతంలోలా మార్చి ఇవ్వాలి. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి.
- రామలింగాచారి, బయ్యారెడ్డిపల్లె
సీతమ్మ చెరువుకట్టను మళ్లీ నిర్మించాలి
మాకు సేద్యానికి ఆధారమైన సీతమ్మ చెరువు కట్టను తెంచిన స్థలంలోనే నిర్మించాలి.మాకు 15 ఎకరాల భూమి ఉంది. ప్రాజెక్టు కోసం మా భూమి ఎంత పోతుంది, ఎంత పరిహారం ఇస్తారు అని కూడా అధికారులు చెప్పలేదు. మా భూములను 22ఏ నుంచి తొలగించాలి.
కేఎ్‌స.అమీర్‌జాన్, పెద్దఉప్పరపల్లె