రెస్కో అవినీతి విచారణ నిగ్గు తేలేనా?
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:16 AM
కుప్పం రెస్కోలో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటుతున్నా, విచారణ నివేదిక అందుబాటులో ఉన్నా, ఎందుకనో నిర్ణయం తీసుకోవడానికి ఇటు పాలకులు, అటు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు.
‘వైసీపీ’ నియామక ఉద్యోగుల్లో ఆందోళన
తొలగిస్తే ఏర్పడబోయే పరిణామాలపై అధికార పార్టీలోనూ కలవరం
నేడు మహాజన సభ
కుప్పం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కుప్పం రెస్కోలో గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటుతున్నా, విచారణ నివేదిక అందుబాటులో ఉన్నా, ఎందుకనో నిర్ణయం తీసుకోవడానికి ఇటు పాలకులు, అటు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. సుమారు 130 మంది ఉద్యోగుల భవితవ్యాన్ని నిర్దేశించే ప్రభావం ఉండడంవల్లే ఈ జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితమైన పాలకమండలి ఆధ్వర్యంలో రెస్కో మహాజన సభ సోమవారం జరుగనుంది. రెస్కో అవినీతి, దానిపై నడిచిన విచారణ నివేదిక అమలు, వంటి అంశాలపై తాజాగా మరోమారు చర్చలోకి వచ్చాయి.
కుప్పం రెస్కో బైలా సవరణతో పాటు, వైసీపీ హయాంలో ఈ సంస్థలో జరిగిన అవినీతిపై సాగిన విచారణ నివేదికను మహాజన సభలో సమర్పించనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సుమారు 130 మంది ఉద్యోగులను అవసరానికి మించి, అక్రమంగా నియమించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీంతోపాటు అక్రమ పదోన్నతులపై కూడా ముఖ్యమైన మరో ఆరోపణ వుంది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత జేసీ స్థాయిలో ఈ ఆరోపణలపై విచారణ జరిగింది. అప్పట్లో ఉద్యోగులకు అర్హత పరీక్షలు సైతం నిర్వహించారు. అయితే ఇది సక్రమంగా జరగలేదని, కో ఆపరేటివ్ ఉన్నతాధికారుల్లో ఒకరిద్దరు స్వయంగా అక్రమ నియామకాలలో అస్మదీయులను నియమించుకున్నారన్న ఆరోపణలు కొత్తగా వెలుగు చూడడంతో ఈ విచారణపై నీలినీడలు కమ్ముకుని విశ్వసనీయత లోపించింది. దీని కారణంగా వైసీపీ హయాంలో రెస్కోలో జరిగిన అక్రమాలపై, కో ఆపరేటివ్ సొసైటీల అదనపు రిజిస్ట్రార్ కె.శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఆమె విచారణ సుమారు నాలుగైదు నెలలపాటు సాగింది. విచారణ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఈ నివేదికను ఇప్పటిదాకా ఎవరూ బయట పెట్టలేదు. నివేదికను గోప్యంగా ఉంచడంపట్ల అనంతర కాలంలో ఆరోపణలు వినిపించాయి. అప్పటి విచారణ నివేదికను సోమవారం జరుగనున్న రెస్కో మహాజన సభలో సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికార పార్టీలో ఆందోళన
కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర పైగా అయింది. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి కూడా సుమారుగా ఎనిమిది, తొమ్మిది నెలలు అవుతోంది. వైసీపీ హయాంలో సుమారుగా 100 మందికి పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చారని, అక్రమ పదోన్నతులు జరగడం నిజమని, ఇంకా కొందరు ఉద్యోగులు కొన్ని రకాల అవినీతికి పాల్పడ్డారని, వైసీపీ హయాంలో టెండర్లు ఆహ్వానించకుండా నామినేషన్ల మీద పనులు కట్టబెట్టారని విచారణ నివేదిక తేల్చినట్లు ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయినా ఇంతవరకూ నివేదికను అధికారికంగా బయట పెట్టలేదు. అంతేకాదు, ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. విచారణ ఒకటి జరిగిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, అధికారులను అది తప్పు పట్టిందన్న విషయాన్ని దాదాపు అందరూ మరచిపోయారు. ఇటువంటి తరుణంలో మహాజన సభ జరుగుతుండడం, అందులో అదనపు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికను సమర్పిస్తామని అధికారులు ప్రకటించడం కుప్పంలో చర్చనీయాంశంగా మారింది. అటు రెస్కో ఉద్యోగులతోపాటు అధికార టీడీపీలో కూడా ఈ విషయంలో ఆందోళన నెలకొంది. కారణం, అక్రమ నియామకాలుగా ముద్రపడ్డ 100 మందికి పైగా ఉద్యోగులను విధులనుంచి తొలగిస్తారన్న ప్రచారం జోరందుకోవడం. ఉద్యోగులు వందమందే కావచ్చు కానీ, వారిమీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు మరో వందా, వందా యాభై దాకా ఉంటాయి. ఒకవేళ ఉద్యోగులను తొలగించడం అంటూ జరిగితే రాజకీయంగా తమకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికార పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. అదీకాక వీజీ.ప్రతాప్ చైర్మన్‌గా రెస్కో పాలక మండలిని నియమించి నెలరోజులైనా కాలేదు. అధికారులే పర్సన్ ఇన్‌చార్జిలుగా ఉన్నప్పుడే విచారణ నివేదికను బయటపెట్టి, ఉద్యోగులను తొలగించడమో లేదా ఇతరత్రా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో జరిగి ఉంటే కొంతలో కొంత అధికార పార్టీకి సంబంధం లేకుండా ఉండేది. సరిగ్గా పాలకమండలి నియామకమై మొదటి మహాజన సభలోనే అది అవినీతి ఆరోపణలపైన అయినా సరే, ఉద్యోగుల తొలగింపు జరిగితే త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం పడుతుందన్న ఆందోళన టీడీపీలో అంతర్గతంగా నెలకొంది. 2014-2019మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పటినుంచీ ఉద్యోగాల్లో ఉంటూ పదోన్నతులు సైతం పొందిన 17మంది రెస్కో ఉద్యోగులను సైతం తొలగించబోతున్నారన్న ప్రచారం మరింత నష్టం కలిగించే అవకాశం ఉన్నదన్న భావన టీడీపీ నేతల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో రెస్కో మహాజన సభలో ఏమి జరుగనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.