Share News

సత్యవేడు కొలిక్కి వస్తుందా?

ABN , Publish Date - May 07 , 2025 | 01:12 AM

యువనేత, మంత్రి నారా లోకేశ్‌ బుధవారం సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతుండడంతో ఇక్కడి రాజకీయాలపై జిల్లా అంతా ఆసక్తి నెలకొంది. టీడీపీకి తొలి నుంచీ బలమైన పట్టున్న నియోజకవర్గంలో వర్గవిభేదాలు తారస్థాయిలో ఉన్న సమయంలో లోకేశ్‌ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్‌ తొలగుతుందా? నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా ఎవరిని నియమించబోతున్నారు? అనే అంశాలు చర్చగా మారిన నేపథ్యంలో లోకేశ్‌ అన్నీ చక్కదిద్దుతారనే ఆశాభావంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి.

సత్యవేడు కొలిక్కి వస్తుందా?
సత్యవేడులో లోకేశ్‌ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు

- టీడీపీ కోటలో వర్గాలతో బీటలు

- నారా లోకేశ్‌ కొలిక్కి తెస్తారని శ్రేణుల్లో ఆశలు

తిరుపతి, మే 6 (ఆంధ్రజ్యోతి): యువనేత, మంత్రి నారా లోకేశ్‌ బుధవారం సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతుండడంతో ఇక్కడి రాజకీయాలపై జిల్లా అంతా ఆసక్తి నెలకొంది. టీడీపీకి తొలి నుంచీ బలమైన పట్టున్న నియోజకవర్గంలో వర్గవిభేదాలు తారస్థాయిలో ఉన్న సమయంలో లోకేశ్‌ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్‌ తొలగుతుందా? నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా ఎవరిని నియమించబోతున్నారు? అనే అంశాలు చర్చగా మారిన నేపథ్యంలో లోకేశ్‌ అన్నీ చక్కదిద్దుతారనే ఆశాభావంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి.

తొలినుంచీ నాయకత్వ సంక్షోభమే!

సత్యవేడు నియోజకవర్గం తొలి నుంచీ టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతం. పార్టీ ఆవిర్భావం నుంచీ ఇప్పటి వరకూ పది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ నేతల నడుమ వర్గ విభేదాల కారణంగానే ఆ మూడు సార్లూ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గంలో తొలినుంచీ టీడీపీకి నాయకత్వ సమస్య ఎదురవుతూనే వుంది. తొలి ఎన్నికల్లో పోటీ చేసిన తలారి మనోహర్‌ మొదలుకుని తర్వాత వచ్చిన సురాజ్‌, నారమల్లి శివప్రసాద్‌, హేమలత, తలారి ఆదిత్యతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరకూ ఎవరూ బలంగా నిలదొక్కుకోలేకపోయారు. ఐదేళ్ళలోపే పార్టీ నుంచీ బలమైన వ్యతిరేకత ఎదుర్కొనడం, తదుపరి ఎన్నికల్లో టికెట్‌ కోల్పోవడం, నియోజకవర్గ ముఖచిత్రం నుంచీ తెరమరుగు కావడం జరుగుతోంది.

ఐదేళ్ళ నుంచీ దారీ తెన్నూ లేని పార్టీగా..

గత ఐదేళ్లూ సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ మరీ దారుణ పరిస్థితులను ఎదుర్కొంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తలారి ఆదిత్యకు 2019లో టికెట్‌ దక్కలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసిన జేడీ రాజశేఖర్‌ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఇంఛార్జి పదవి దక్కలేదు. కొంతకాలం ఇంఛార్జి లేకుండా గడిచాక మాజీ ఎమ్మెల్యే హేమలతకు ఆ బాధ్యతలు అప్పగించారు. నెలల వ్యవధిలోనే ఆమెను తప్పించి ఆమె కుమార్తె డాక్టర్‌ హెలెన్‌కు ఇంఛార్జి ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో హేమలత (హెలెన్‌) వర్గం, జేడీ రాజశేఖర్‌ వర్గాలు ఏర్పడ్డాయి. తీరా 2024 ఎన్నికల్లో వీరిద్దరినీ పక్కన పెట్టి అధిష్ఠానం అధిష్టానం వైసీపీ నుంచీ వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టికెట్‌ ఇచ్చింది. ఆయన గెలుపునకు హేమలత, రాజశేఖర్‌ వర్గాలు పనిచేయలేదు. రాజశేఖర్‌ ఇండిపెంటెండ్‌గా పోటీ చేశారు. హేమలత వర్గం మరో ఇండిపెండెంట్‌ రమే్‌షకు మద్దతిచ్చింది. అయితే కోనేటి ఆదిమూలం ఇంతటి ప్రతికూలతను కూడా అధిగమించి పార్టీ సానుకూల ప్రభంజనం వల్ల ఎమ్మెల్యేగా గెలిచారు.

సస్పెన్షన్‌లోనే ఆదిమూలం

గెలిచినా కోనేటి ఆదిమూలం రాజకీయంగా స్థిరంగా అయితే లేరు. టీడీపీ వారికి కాకుండా వైసీపీ నుంచీ తన వెంట వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనికితోడు ఓ మహిళతో వివాదం కారణంగా క్రిమినల్‌ కేసులో చిక్కుకుని పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినడానికి కారకులయ్యారు. దీంతో పార్టీ నుంచీ ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఆ కేసు న్యాయస్థానంలో రాజీ చేసుకున్నప్పటికీ పార్టీ సస్పెన్షన్‌ మాత్రం ఇంకా తొలగలేదు. దీంతో ఏడు నెలలకుపైగా నియోజకవర్గంలో పార్టీకి దారీ తెన్నూ లేకుండా పోయింది. నాయకులు, కార్యకర్తలూ పెద్దగా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళడం లేదు. గత ఎన్నికల సమయంలో పరిశీలకుడిగా ఉన్న చంద్రశేఖర్‌ నాయుడు ఓ వర్గ నేతగా ఎదిగారు. ఆయనకు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పదవి దక్కుతుందని అనుచరవర్గం ఆశిస్తోంది. మాజీ ఎమ్మెల్యే హేమలత అడపాదడపా వచ్చి వెళుతున్నారు. కొద్దోగొప్పో వర్గాన్ని కూడగట్టుకుని ఇంఛార్జి పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి వంద రోజుల తర్వాత చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణకు కో ఆర్డినేటర్‌గా నియమితులైన శ్రీపతిబాబు కూడా ఒక వర్గాన్ని ఏర్పరుచుకుంటున్నారు. వీరిలో చంద్రశేఖర్‌ నాయుడు పక్షం రోజుల కిందట అభివృద్ధి పనులు ప్రారంభించడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎస్సీ నియోజకవర్గం అని అలుసుగా తీసుకుంటున్నారని, ఇతర నియోజకవర్గాల్లో ఇలా చేయగలరా అంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలా నేతలు వర్గాలుగా విడిపోవడంతో- నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం, పనుల కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. కాగా యువనేత నారా లోకేశ్‌ నేడు సత్యవేడుకు వచ్చి పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆశాభావంతో వున్నాయి. ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేలా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నారు.

Updated Date - May 07 , 2025 | 01:12 AM