Share News

కదలరు..వదలరు

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:53 AM

జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు 97మంది పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 30శాతం మంది ఏళ్ల తరబడి ఆయా మండలాల్లోనే తిష్టవేశారు.

 కదలరు..వదలరు

ఏళ్ల కొద్దీ ఒకే ప్రాంతంలో తిష్ట

ప్రభుత్వం మారినా కొనసాగుతున్న వైనం

జిల్లా రెవెన్యూలో ఇదీ సంగతి

ఈ బదిలీల్లోనైనా కదిలిస్తారా?

- తిరుపతి(కలెక్టరేట్‌), ఆంధ్రజ్యోతి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు 97మంది పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 30శాతం మంది ఏళ్ల తరబడి ఆయా మండలాల్లోనే తిష్టవేశారు. మచ్చుకు కొందరిని పరిశీలిస్తే..

  • తిరుపతిలో ఓ సీఎ్‌సడీటీ సుమారు 12 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. ఆయన్ను పలుమార్లు వేరే మండలాలకు బదిలీచేసినా రాజకీయ నేత సిఫార్సుతో తిరిగి ఇక్కడికే డిప్యూటేషన్‌పై వస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన హవా సాగిపోతోంది.

- తిరుపతిలోనే వీఆర్వోగా మొదలై ఇప్పుడు డీటీ వరకు సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్నారో అధికారి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయనకు ఇబ్బంది లేదు. ఈయన కుమారుడు రాజధానిలో సీఎం తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి వద్ద ఓఎస్డీగా పనిచేస్తుండటంతో ఈయన్ను బదిలీ చేయడానికి అధికారులు సాహసించడంలేదు.

- చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ సీఎస్‌ డీటీ.. చిట్టమూరులో ఒక డీటీ ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నారు.

  • సూళ్లూరుపేట నియోజకవర్గంలో తీరప్రాంతానికి చెందిన మండలంలో ఓ డీటీ దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారు. అక్కడి నేతల సహకారంతో ఇన్‌చార్జి తహసీల్దారుగానూ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో మరో కీలకమైన మండలానికి ఓ డీటీ వైసీపీ ప్రభుత్వంలోను, ప్రస్తుత ఇన్‌ఛార్జి తహసీల్దారుగా పనిచేస్తుండటం గమనార్హం. అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బంధువు గత ప్రభుత్వంలో తహసీల్దారుగా పనిచేశారు. ప్రభుత్వం మారినా తిరిగి రెవెన్యూ హెడ్‌క్వార్టర్‌లో కీలక పోస్టులో ఉన్నారు.

  • గూడూరు కేంద్రంలోని ఓ డీటీ సుదీర్ఘంగా అక్కడే పనిచేస్తున్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్‌లో మూడు మండలాలకు ఇన్‌ఛార్జి తహసీల్దార్లుగా డీటీలు కొనసాగుతున్నారు. సూళ్లూరుపేట డివిజన్‌లోని రెండు మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

వీఆర్వోల పరిస్థితి మరీ దారుణం

జిల్లాలో సుమారు 370 మంది వీఆర్వోలు ఉన్నారు. ఏళ్ల తరబడి జిల్లాకేంద్రానికి సమీపంలోనే గ్రామీణ మండలాల్లో పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్‌ మండలంలోనే ఏళ్ల కొద్దీ పదిమంది వీఆర్వోలు తిష్టవేసుకుని కూర్చున్నారు. కొందరు వీఆర్వోలు ఐదేళ్లకు ఒకసారి క్లస్టర్‌ లేదా గ్రామం మారుతున్నారు తప్ప దూరమండలాలకు వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో దూరప్రాంతాల్లోని వీఆర్వోలు దగ్గర మండలాలకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు.

ఈ అధికారుల మాటేమిటి?

  • పర్యాటక శాఖలో పనిచేసే ఓ అధికారికి కడపలోని వైసీపీ నేతలతో బంధుత్వముంది. దీంతో గత ఐదేళ్లు ఇక్కడే ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఓ ప్రభుత్వ న్యాయవాది పలుకుబడితో పర్యాటక శాఖతో పాటు మరో రెండు పోస్టుల్లో కొనసాగుతున్నారు. ఇతడి వ్యవహార శైలి, తీరుపై ఒకశాఖలోని ఉద్యోగులు ఇటీవల రాజధానికి వరుస ఫిర్యాదులు చేశారు.

  • గత ప్రభుత్వంలో మాజీ మంత్రి అండదండలతో దేవదాయశాఖలో పనిచేసే ఓ అధికారి ఇప్పటికీ జిల్లాలో కొనసాగుతున్నారు. దేవదాయశాఖ, మఠం భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోకపోవడంపై ఆరోపణలు ఉన్నాయి.

  • ఇక పౌరసరఫరాల శాఖలో గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న ఓ అధికారిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రాజధానికి వెళ్లి పైరవీ చేసి తిరిగి పోస్టు తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఇలాంటి వారెందరో ఉన్నారు.

పంచాయతీల్లో..

జిల్లాలో 774 గ్రామ పంచాయతీలను జనాభా, ఆదాయాన్ని బట్టి వర్గీకరణకు ప్రభత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కసరత్తు పూర్తయి ప్రభుత్వానికి నివేదికలుకూడా వెళ్లాయి. అయితే గ్రేడ్‌తో పనిలేకుండా మేజర్‌పంచాయతీలకు రావడానికి రాజకీయ నేతల నుంచిజిల్లా యంత్రాంగంపై పలువురు ఒత్తిడి తెస్తున్నారు.

ఎల్లుండితో బదిలీల గడువు పూర్తి

ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ప్రభుత్వం సోమవారం వరకు పొడిగించింది. మంగళవారం నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ క్రమలంలో అనువైన చోట పోస్టింగ్‌కు పలువురు తహసీల్దారు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కడుతున్నారు. వైసీపీతో అంటకాగిన అధికారుల్లో పలువురు ఇంకా కీలకస్థానాల్లో పనిచేస్తున్నారు. ఇక, తిరుపతి అర్బన్‌, ఎర్రావారిపాళెం, కేవీబీపురం, పాకాల, వెంకటగిరి, చిల్లకూరు, నాయుడుపేట మండలాలకు తహసీల్దారు పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

స్లాటెడ్‌ సర్వ దర్శన టోకెన్లకు పోటెత్తిన భక్తులు

తిరుపతిలో జారీ చేసే శ్రీవారి స్లాటెడ్‌ సర్వదర్శనం(ఎ్‌సఎ్‌సడీ) టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద శుక్రవార భారీగా రద్దీ నెలకొంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం, విష్ణునివాసం కౌంటర్ల వద్దనున్న క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో సాయంత్రం నుంచే శనివారానికి సంబంధించిన టోకెన్లను జారీ చేశారు. దీంతో మధ్యాహ్నం నుంచే భక్తులు ప్రవేశించడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి తోపులాట, తొక్కిసలాటలకు తావులేకుండా భక్తులు టోకెన్లు పొందారు.

తిరుమలలో పెరిగిన రద్దీ : ఇక, తిరుమలలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం.. వేసవి సెలువులు ముగింపు దశకు రావడంతో శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నప్రసాద భవనం, రాంభగీచ, లేపాక్షి సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూకాంపెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండి.. క్యూలైన్‌ ఏటీజీహెచ్‌ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి 15 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. టైంస్లాట్‌ టోకెన్లు, టికెట్లున్న భక్తులకూ మూడు గంటలు పడుతోంది. గదులు కేటాయింంచే సీఆర్వో, ఎంబీసీ, పద్మావతి కౌంటర్లు.. కల్యాణకట్టల వద్దా రద్దీ నెలకొంది. ఎక్కువ మంది భక్తులు సొంత వాహనాల్లోనే రావడంతో అలిపిరి చెక్‌పాయింట్‌ రద్దీ కనిపించింది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

మూడు ‘విండో’లకు పీఐసీల మార్పు

తిరుపతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మూడు సింగిల్‌ విండోలకు అఫిషియల్‌ పర్సన్‌ ఇంఛార్జి కమిటీ (పీఐసీ)లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిప్పగుంటపాలెం, కురుగొండ, దామానెల్లూరు సింగిల్‌ విండోలకు గతేడాది డిసెంబరు నుంచీ సహకార శాఖ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఇలియాజ్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల సెలవు పెట్టడంతో ఆ స్థానంలో ఈ మూడు సింగిల్‌విండోలకు వేర్వేరుగా అఫిషియల్‌ పర్సన్‌ ఇంఛార్జులు నియమితులయ్యారు. తిప్పగుంటపాలెం విండోకు గూడూరు జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.అర్కినాధన్‌, కురుగొండ విండోకు వెంకటగిరి జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌పి.నజ్రీన్‌, దామానెల్లూరు విండోకు గూడూరు జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.మహే్‌షసింగ్‌ను పర్సన్‌ ఇంఛార్జులుగా నియమించారు.

Updated Date - Jun 07 , 2025 | 01:53 AM