మామిడి రైతుకు మద్దతేదీ?
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:51 AM
మామిడికి మద్దతు ధరపై ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల ఆదేశాలను గుజ్జు పరిశ్రమలు, ర్యాంపు యజమానులు, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. వీరంతా సిండికేటుగా మారి బుధవారం ర్యాంపుల వద్ద కొనుగోళ్లను ఆపేశారు. దీంతో రైతులు పడిగాపులు గాస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా తక్కువకు కొంటే చర్యలు తీసుకుంటాం.
ఇదీ కలెక్టర్ వెంకటేశ్వర్ చేస్తున్న హెచ్చరికలు. అయినా, మామిడి రైతులకు వ్యాపారుల నుంచి మద్దతు రావడం లేదు.
- పాకాల, ఆంధ్రజ్యోతి
మామిడికి మద్దతు ధరపై ప్రభుత్వ ప్రకటనలు, అధికారుల ఆదేశాలను గుజ్జు పరిశ్రమలు, ర్యాంపు యజమానులు, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. వీరంతా సిండికేటుగా మారి బుధవారం ర్యాంపుల వద్ద కొనుగోళ్లను ఆపేశారు. దీంతో రైతులు పడిగాపులు గాస్తున్నారు. తోతాపురి టన్ను మద్దతు ధర రూ.8వేలు కాగా.. కనీసం రూ. 6వేలకైనా కొనాలని రైతులు ప్రాధేయపడుతున్నా వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. చివరకు బుధవారం రూ.3వేలకు ధర పడిపోయింది. చీకటి పడ్డాక కొందరు రూ.1500కే కొనుగోలు చేశారు. మామిడి కోత కూలీ, రవాణాకుగాను టన్నుకు రూ.2500 ఖర్చవుతోందని రైతులు అంటున్నారు. చివరకు ఈ కూలి ఖర్చులూ రాక చేతినుంచి పడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టన్ను రూ.2వేలకు కూడా కొనుగోలు చేయకపోవడంతో కొందరు కడుపుమండి ట్రాక్టర్లలో తెచ్చిన మామిడి కాయలను రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోతున్నారు. ఇక, మరోవైపు గుజ్జు పరిశ్రమలకు ట్రాక్టర్లలో తీసుకెళ్తే అన్‌లోడింగ్‌కు రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్లు దొరకడంకూడా కష్టమవుతోంది. దామలచెరువు పరిసరాల్లోని ర్యాంపుల యజమానులు ఒక్కటై ఇబ్బందులు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, జగన్మోహన్, మురళీమోహన్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఉద్యాన శాఖ అధికారులు, మ్యాంగోనగర్‌కు వచ్చి వ్యాపారులతో, గుజ్జు పరిశ్రమల యజమానులు, ర్యాంప్ నిర్వాహకులతో చర్చించినా ఫలితం కనిపించలేదు. మామిడి తోటల్లో తోతాపురి కాయలన్నీ పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని, త్వరతగతిన కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా, ఎస్పీ హర్షవర్ధనరాజు బుధవారం దామలచెరువులోని మ్యాంగోనగర్‌కు వచ్చి వ్యాపారులు, సప్లయర్లతో మాట్లాడారు. మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, మండల ఉద్యాన అధికారి శైలజ బుధవారం మ్యాంగోనగర్‌లో పర్యటించారు. గుజ్జుపరిశ్రమల యజమానులు, ర్యాంప్‌లవద్ద సప్లయర్లు, మండీ వ్యాపారులు తోతాపురి మామిడికాయలు కొనుగోలు చేసి రైతులకు సహకరించాలని కోరారు. ర్యాంప్‌ల వద్ద టోకెన్లు ఇచ్చి రైతులు ఇబ్బందులు పడకుండా మద్దతు ధరకు కొనాలని లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు.
‘మద్దతు’ లేకుంటే కఠిన చర్యలు: కలెక్టర్
తిరుపత(కలెక్టరేట్), జూన్ 18(ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడిపై మద్దతు ధరకన్నా తక్కువ చెల్లించేవారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. కలెక్టరేట్ నుంచి బుధవరాం గుజ్జు పరిశ్రమ యాజమాన్యం, అధికారులతో ఆయన వర్చువల్‌గా సమీక్షించారు. ‘దామలచెరువులోని ట్రేడర్లు రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మద్దతు ధరకంటే తక్కువ ఇస్తే చర్యలు తీసుకుంటాం. గుజ్జు పరిశ్రమలకు మామిడికాయలను తెచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. జిల్లాలో మామిడి పంట ఉత్పత్తికన్నా ఎక్కువగా ఉన్న కారణంగా ప్యాకింగ్ మెటీరియల్‌ను సమకూర్చుకుని ప్రాసెసింగ్ యూనిట్ల కెపాసిటీని పెంచుకోవాలి. రైతులకు రావాల్సిన డబ్బును త్వరలో అందించాలి. ధరల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలి. మండలాల్లో తహసీల్దార్లు, ఉద్యాన అధికారులు మామిడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.
బారులు తీరిన ట్రాక్టర్లు
ఎర్రావారిపాలెం(ఆంధ్రజ్యోతి): ఎర్రావారిపాలెంలోని జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం మామిడి కాయలతో ట్రాక్టర్లు బారులు తీరాయి. గతేడాది పల్ప్ ఇప్పటికీ అమ్ముడుపోలేదంటూ ఈసారి పెద్దగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో పంటలో 10 శాతం కన్నా తక్కువే ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రోత్సహకం ప్రకటించినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
35 గంటల వెయిటింగ్
తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి: ఫ్యాక్టరీలకు ట్రాక్టర్లలో మామిడి కాయలు తీసుకెళ్లే గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆ వివరాలను చూస్తే.. నవ క్వాలిటీ ఫుడ్స్(ఎర్రావారిపాళెం)లో గరిష్ఠంగా 35గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. రాసా ఫుడ్స్ (బీఎన్‌కండ్రిగ) గంట.. లియాన్ ఫుడ్స్(పుత్తూరు) 12గంటలు.. టాసా ఫుడ్స్(నారాయణవనం) 24గంటలు.. శ్రీవర్ష ఫుడ్స్(రేణిగుంట) 12గంటలు.. శ్రీదేవరాజుఆగ్రో ఫుడ్స్(కేవీబీపురం) 12గంటలు.. క్యాప్రికాన్(సత్యవేడు) 5గంటలు,, సుప్రీం క్వాలిటీ ఫుడ్స్ (పాకాల) 20 గంటలు వాహనాలు వేచి ఉండే పరిస్థితి ఉందని జిల్లా ఉద్యానశాఖాధికారి దశరఽధరామిరెడ్డి తెలిపారు. టోకెన్ సిస్టమ్ పాటిస్తే ఈ పరిస్థితి తప్పుతుందన్నారు. ఇక, బుధవారం గుజ్జు పరిశ్రమలు 2,114.02 టన్నుల కాయలను కొనగా.. మొత్తం 14,507.788 టన్నులకు చేరింది.