Share News

‘ముక్కంటి’ ఆలయ ఛైర్మన్‌ ఎవరు?

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:52 AM

శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎవరు? ఈ ప్రశ్నకు రెండు మూడు రోజుల్లో స్పష్టత రానున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వారం రోజులుగా సాగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. అన్నీ సజావుగా సాగితే గురువారం ఛైర్మన్‌ పదవి ఎవరికి ఖరారైందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది అధిష్ఠానం. ఆశావహుల వడపోత, నేపథ్యాల పరిశీలన జరుగుతుండడంతో ఆశావహుల ప్రయత్నాలు జోరందుకున్నాయి.

‘ముక్కంటి’ ఆలయ ఛైర్మన్‌ ఎవరు?

మొదలైన కసరత్తు

రెండు మూడు రోజుల్లో ప్రకటన

అధినేత పరిశీలనలో పలువురి పేర్లు

శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎవరు? ఈ ప్రశ్నకు రెండు మూడు రోజుల్లో స్పష్టత రానున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వారం రోజులుగా సాగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. అన్నీ సజావుగా సాగితే గురువారం ఛైర్మన్‌ పదవి ఎవరికి ఖరారైందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది అధిష్ఠానం. ఆశావహుల వడపోత, నేపథ్యాల పరిశీలన జరుగుతుండడంతో ఆశావహుల ప్రయత్నాలు జోరందుకున్నాయి.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఏడాది కాలంగా ముక్కంటి ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ పదవి కోసం ఆశావహులు ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని 6-సి కేటగిరీ ఆలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యముంది. దానితో పాటే రోజువారీ భారీ సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయం కావడం, రోజువారీ రూ.కోటికి పైగా ఆదాయం వున్న ఆలయం కావడంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. అదే స్థాయిలో పాలకమండలి పదవికి తీవ్ర పోటీ కూడా వుంది. ఏడాదిగా ఆశావహులు ఎదురుచూపులు ఫలించే సమయం ఆసన్నం కావడంతో రకరకాల మార్గాల్లో తమ ప్రయత్నాలను ఉధృతం చేస్తున్నారు.

ఛైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారి జాబితా పెద్దదే!

పాలకమండలి ఛైర్మన్‌ పదవిని ఆశించే వారిలో మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ చెంచయ్య నాయుడు ముందు వరుసలో వున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆయన కుటుంబం పార్టీలో కొనసాగుతుండడంతో పాటు పార్టీకి, బొజ్జల కుటుంబానికి ఆయన నమ్మిన బంటుగా పేరుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల వేధింపులకు గురి కావడం, సుమారు ఎనిమిది కేసులను ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ మించి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సిఫారసు చేసిన ఏకైక పేరు ఈయనదే కావడం గమనార్హం. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తన వర్గం నుంచీ మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కుమారుడు ప్రవీణ్‌ పేరును అధిష్ఠానానికి ప్రతిపాదించారు. టీడీపీ నుంచీ సీనియర్‌ నేతలు రెడ్డివారి గురవారెడ్డి, దశరధాచారి కూడా పదవి ఆశిస్తున్నారు. వీరు నేరుగా అధిష్ఠానాన్నే నమ్ముకున్నారు. బీజేపీ ముఖ్యనేత కోలా ఆనంద్‌ తన కుటుంబసభ్యుల్లో ఒకరికి పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. వీరు కాకుండా జనసేన నుంచీ మాజీ ఇన్‌ఛార్జి వినుత భర్త చంద్రబాబు పేరు కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉండేది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో జనసేన అధిష్ఠానం వారిని బహిష్కరించడం తెలిసిందే. తిరుపతికి చెందిన ఓ విద్యా సంస్థ అధినేత పేరు కూడా జనసేన తరపున బలంగా వినిపిస్తోంది. అయితే స్థానికేతరులు కావడంతో వెనుకబడినట్టు సమాచారం. చెంచయ్యనాయుడికి పదవి కోసం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధిష్ఠానం వద్ద గట్టిగా పట్టుబట్టినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో అస్తవ్యస్తంగా వున్న ముక్కంటి ఆలయ నిర్వహణను తాను ప్రక్షాళన చేసి చక్కదిద్దానని, ఇపుడు తాను సూచించిన వ్యక్తినే పాలకమండలి ఛైర్మన్‌గా నియమిస్తే ఆలయ నిర్వహణ సక్రమంగా ఉంటుందని చెబుతున్నట్టు సమాచారం.

ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపట్టిన అధిష్ఠానం

ముక్కంటి ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ పదవి ఖరారు చేసే ప్రక్రియ తుదిదశకు చేరుకున్న నేపధ్యంలో టీడీపీ అధిష్ఠానం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపట్టినట్టు సమాచారం. ఈ సర్వేలో ఆశావహుల పేర్లు ప్రస్తావించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని తెలిసింది. నేతల సిఫారసుల సంగతి పక్కన పెడితే ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో వచ్చే ఫలితాలను బట్టే ఛైర్మన్‌ పదవికి తగిన ఆశావహుని ఎంపిక చేసే పరిస్థితి వుందని తెలిసింది. మొత్తానికీ రెండు మూడు రోజుల్లో వెలువడనున్న పాలకమండలి ఛైర్మన్‌ ఎంపిక ప్రకటన కోసం ఆశావహులతో పాటు కూటమి పార్టీల శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు సైతం ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:52 AM