ఎవరెవరికి ఏయే పదవులు?
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:55 AM
చిత్తూరు జిల్లా కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అని తెలుగుదేశం వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమకు ఫలానా పదవి కావాలని ఆ మధ్య త్రిసభ్య కమిటీని కోరిన నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటూనేవున్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి పదవులకు నాయకుల మధ్య తీవ్రపోటీ
మండల కమిటీల నియామకం పూర్తి
ఇక జిల్లా కమిటీలపైనే అధిష్ఠానం కసరత్తు
వచ్చే వారంలో ప్రకటించే అవకాశం
చిత్తూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కమిటీలో ఎవరెవరికి చోటు దక్కుతుందా అని తెలుగుదేశం వర్గాలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమకు ఫలానా పదవి కావాలని ఆ మధ్య త్రిసభ్య కమిటీని కోరిన నాయకులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటూనేవున్నారు. సాధారణంగా అధికార పార్టీలో జిల్లా అధ్యక్ష పదవికి డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకుని కమిటీలను వేస్తున్నారు. వైజాగ్‌లో జరుగుతున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నేటితో ముగియనుంది. వాస్తవానికి ఈ సమ్మిట్ హడావిడితోనే జిల్లా కమిటీల కసరత్తును వాయిదా వేశారు. వచ్చే వారంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోస్టులతో పాటు జిల్లా కమిటీని ప్రకటించే అవకాశాలున్నాయి.
ఫ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కుప్పం, చిత్తూరు, నగరి, చంద్రగిరి నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉండడంతో ఈసారి అధ్యక్ష పదవి ఆ సామాజికవర్గానికి రాదని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆ వర్గానికి ఇవ్వాల్సి వచ్చినా కార్యదర్శితో సరిపెట్టొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే ఎస్సీ నియోజకవర్గాల నుంచి నేతలను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎన్పీ జయప్రకాష్, జీడీనెల్లూరు నుంచి భీమనేని చిట్టిబాబు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో జయప్రకాష్‌కు లోకల్ ఎమ్మెల్యే మురళీమోహన్ సపోర్టు ఉండగా, చిట్టిబాబుకు స్థానిక ఎమ్మెల్యే థామస్ సపోర్టు లేదు. ‘ఎమ్మెల్యేల సపోర్టు’ అనే అంశాన్ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా.. అనేది చూడాల్సి వుంది.ఫ బీసీ వర్గాలకు ఇవ్వాల్సి వస్తే ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న సీఆర్ రాజన్, నగరి నియోజకవర్గానికి చెందిన షణ్ముగరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ వన్నియకుల క్షత్రియ సామాజికవర్గానికే చెందినవారే. ఆ మధ్య వీరిద్దరి పేర్లతో అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్ సర్వే కూడా చేసింది. వీరిలో సీఆర్ రాజన్‌కు వన్నికుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టు ఉండడంతో మరో పోస్టు ఇస్తారా.. అనే అంశంపై కూడా స్పష్టత లేదు.ఫ ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన అధ్యక్ష పదవి కావాలని త్రిసభ్య కమిటీకి విన్నవించడంతో పాటు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆయా సమస్యల మీద మీడియాలో పార్టీ గళాన్ని విప్పుతూ యాక్టివ్‌గా ఉంటున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీకి అవకాశమున్నా, ఆయన తిరస్కరించినట్లు సమాచారం.ఫ బలిజ సామాజికవర్గం విషయానికొస్తే..చిత్తూరుకు చెందిన కాజూరు బాలాజీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆరుగురు ఆశావహుల గ్రూపులో ఈయన కూడా ఉన్నారు. బలిజ కోటాలో తనకు టికెట్ వస్తుందని ఆశించారు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కోసం త్రిసభ్య కమిటీని కోరడంతో పాటు ఎమ్మెల్యేలతో కూడా సిఫార్సు చేయిస్తున్నారు. ఈయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ గట్టిగా అడగలేదు, కానీ అధ్యక్ష పదవి ఇస్తే చేస్తానని త్రిసభ్య కమిటీతో చెప్పి ఉన్నారు. కఠారి హేమలత విషయానికొస్తే ఆమె ఇప్పుడు చుడా ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. మేయర్ పదవిని ఆశిస్తున్నారు కాబట్టి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేయనట్టు కనిపిస్తోంది.ఫ తెలుగు యువత, తెలుగు మహిళ అధ్యక్ష పోస్టులు కూడా అధ్యక్ష- కార్యదర్శి పదవులు పొందిన సామాజికవర్గాలు కాకుండా మిగిలిన వర్గాలకు ఇస్తుంటారు. పాకాలకు చెందిన కిశోర్, గుడిపాలకు చెందిన తలపనేని పవన్ కమ్మ కోటాలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా అధ్యక్షురాలి పదవి కోసం ఎస్సీ కోటాలో నగరి నియోజవర్గానికి చెందిన మీరా పేరు వినిపిస్తోంది. ఈమె, ప్రస్తుత అధ్యక్షురాలు కార్జాల అరుణతో పాటు యువగళం పాదయాత్ర సమయంలో చీర తీసుకుని రోజా ఇంటికి వెళ్లగా.. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే.