Share News

టీటీడీ బోర్డులో తిరుపతి ఎమ్మెల్యేకి చోటెప్పుడు?

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:18 AM

తిరుమల బాలాజీనగర్‌లో కాలనీ ఇళ్లను బాగు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ ఉన్నతాధికారులను కోరారు

టీటీడీ బోర్డులో తిరుపతి ఎమ్మెల్యేకి చోటెప్పుడు?

(తిరుపతి- ఆంధ్రజ్యోతి)

తిరుమల బాలాజీనగర్‌లో కాలనీ బాగా దెబ్బతిన్న ఇళ్లను బాగు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అక్కడి స్థానికుల విజ్ఞప్తి మేరకు పలుసార్లు టీటీడీ ఉన్నతాధికారులను కోరారు. కానీ ఇప్పటివరకు ఒక ఇటుక కూడా కదలలేదు.

తిరుపతిలో టీటీడీ చేయాల్సిన కొన్ని మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే గొంతు వినిపించే అవకాశం దొరకలేదు.

తిరుపతి నగర అభివృద్ధి టీటీడీతో ముడిపడి ఉంటుంది. టీటీడీ ఉద్యోగులంతా నివసించేది తిరుమలలోనే. ఈ రెండింటికీ వారధిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులకు టీటీడీ పాలకమండలిలో అవకాశం ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో ఆ అవకాశం తిరుపతి ఎమ్మెల్యేకి దక్కినా, కూటమి ప్రభుత్వంలో మాత్రం లభించలేదు. తిరుపతి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా టీటీడీ పాలకమండలిలో మాట్లాడే అవకాశం ఉంటే సమస్యలు సత్వరమే పరిష్కారదిశగా అడుగులు పడే వీలుంటుంది. తిరుపతి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చి బడ్జెట్‌ కేటాయింపులు, పనుల్లో వేగం పెంచేలా చేయవచ్చు. స్థానిక సమస్యలను, అభ్యర్థులను బోర్డు సమావేశాల్లో వినిపించవచ్చు. పాలకమండలిలో ఎమ్మెల్యే ఉండడం వలన ప్రజల సమస్యలు, అభ్యర్థనలు త్వరగా పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీకి మధ్య వారధిగా ఎమ్మెల్యే పనిచేసే సౌలభ్యం ఉంటుంది. అంతేకాకుండా తిరుపతి నగరానికి ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత, అభివృద్ధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.

తుడాకిచ్చి ఎమ్మెల్యేని పక్కనపెట్టి

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం నుంచి తుడా ఛైర్మన్‌ను టీటీడీ ఎక్స్‌అఫిషియోగా చేర్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని రద్దుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ప్రభుత్వం తిరుపతి ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్లకిద్దరికీ టీటీడీ పాలకమండలిలో అవకాశం కల్పించింది. ఈక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్‌రెడ్డి 52 మందితో జంబో కమిటీవేస్తే కోర్టు మొట్టికాయలు వేస్తూ రద్దు చేసింది. అయితే తిరుపతి ఎమ్మెల్యేగా టీటీడీ పాలకమండలిలో ఉండొచ్చని కోర్టు చెప్పింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ప్రత్యేక ఆహ్యానితుడిగా కొనసాగారు. ఆతర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తుడా ఛైర్మన్‌కు మాత్రమే టీటీడీ ఎక్స్‌అఫిషియోగా కొనసాగిస్తూ జీవో ఇచ్చారు. ఎమ్మెల్యేను మాత్రం సందిగ్ధంలో పెట్టేశారు.

టీటీడీ బోర్డులో చోటెందుకంటే..?

టీటీడీలో రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యగులు దాదాపు 20వేలకుపైనే ఉన్నారు. అదేవిధంగా తిరుమలలోని బాలాజీనగర్‌లో దాదాపు 1100 కుటుంబాలు నివసిస్తున్నారు. వీరంతా తిరుపతి నియోజకవర్గ ఓటర్లే. ఎమ్మెల్యేగా వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దేశ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికులకోసం తిరుపతి, తిరుమలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కృషిచేయాల్సివుంది. టీటీడీతో పాటు తిరుమల స్థానిక ప్రజల నుంచీ నిరంతరం ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే ఎమ్మెల్యేగా అంత వీలుండకపోవచ్చు. అదే పాలకమండలిలో చోటుంటే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయవచ్చు.

పవన్‌ ద్వారా ఎమ్మెల్యే వినతి

టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న జీవోను కొనసాగించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇదివరకే సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. అంతేకాకుండా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన సంతకం చేసిన వినతి కూడా సీఎంవోకు వెళ్లింది. అయినా పాలకమండలి నియామకం జరిగి ఏడాది దగ్గరపడుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండడంపై జనసైనికులు నైరాశ్యంలో ఉన్నారు. తిరుపతిలో పార్టీ అస్తిత్వానికి సంబంధించిన అంశంగా భావిస్తున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:18 AM