Share News

రెండు కోట్ల ఉద్యోగాలెప్పుడు?

ABN , Publish Date - May 16 , 2025 | 01:10 AM

ప్రధాని మోదీకి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా సూటి ప్రశ్న తిరుపతిలో ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభలు ప్రారంభం

రెండు కోట్ల ఉద్యోగాలెప్పుడు?
నేతల సంఘీభావం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడతారంటూ ప్రధాని నరేంద్రమోదీని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సూటిగా ప్రశ్నించారు. తిరుపతిలో గురువారం సాయంత్రం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) జాతీయ మహాసభల్లో ఆయన ప్రసంగించారు. ఈ హామీ నెరవేర్చి ఉంటే యువతకు ఉపాధి దక్కేదన్నారు. కేంద్రం తీరువల్ల డిగ్రీ పట్టాలు తీసుకొని కోట్లాది మంది యువత రోడ్డుపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భగత్‌సింగ్‌ జాబ్‌ గ్యారెంటీ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండు చేశారు. దీనికి యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు ప్రధాని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీపై యువత సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. ‘ప్రతిపక్షాలు, నక్సలైట్లతో కాకుండా, బీజేపీ రాజకీయ విధానాలవల్లే రాజ్యాంగానికి నష్టం కలిగే ప్రమాదం ఉంది. న్యాయ వ్యవస్థను శాసించే స్థాయికి రాష్ట్రపతి వచ్చారంటే, బీజేపీ విధానాలు ఎంత ప్రమాదకరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడానికి ప్రయత్నిస్తోంది. వీటిని మార్చడానికి యువత పోరాడాలి’ అని కోరారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం ద్వారా మన దేశాన్ని రక్షించుకునే బాధ్యత యువతదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. మన దేశం చేపట్టిన సైనిక చర్యకూ మతం రంగు పూశారంటూ ఎంపీ సంతో్‌షకుమార్‌ విమర్శించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే చర్యలను యువత అడ్డుకోవాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ.. రెండు లక్షల ఉద్యోగాలూ భర్తీ చేయలేదని ఏఐవైఎఫ్‌ జాతీయ అధ్యక్షులు సికిందర్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. విద్య, ఉపాధి హక్కుల అమలుకు యువత ఉద్యమించాల్సిన అవసరముందని ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమల రామన్‌ అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో యువత సమస్యలపై చర్చించి, ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్రబాబు, లెనిన్‌బాబు ప్రకటించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి, గుజ్జుల ఈశ్వరయ్య, నాయకులు వల్లీ ఉల్లా ఖాద్రి, ఖాదర్‌, సిన్హా, దినేష్‌, ప్రతాప్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన యువత పాల్గొన్నారు.

ఆలోచింపచేసిన కళా ప్రదర్శన

ప్రజా నాట్య మండలి కళాకారులు నిర్వహించిన కళా ప్రదర్శన యువతను ఆలోచింప చేసింది. సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రజా నాట్య మండలి ఏపీ, తెలంగాణ కార్యదర్శులు పల్లె నరసింహ, చిన్నం పెంచలయ్య అనేక పాటలతో యువతలో చైతన్యం కలిగించారు. చంద్రానాయక్‌ పాడిన కమ్యూనిస్టు అమరుల గేయం ఆకట్టుకుంది.

Updated Date - May 16 , 2025 | 01:10 AM