Share News

ఎప్పటికి పూర్తవుతుందో?

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:08 AM

ఏడేళ్లక్రితం మొదలైనా అసంపూర్తిగానే పరిశ్రమల శాఖ కార్యాలయ భవనం

ఎప్పటికి పూర్తవుతుందో?

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల శాఖకు శాశ్వత భవన వసతి లేక అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటువారికి అద్దెలు చెల్లించలేక ఇప్పటికి రెండు భవనాలు మార్చారు. ప్రస్తుతం ఓ చిన్న భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు నగర శివారు ప్రాంతమైన ఎస్టేట్‌ ప్రాంతంలో జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం ఉండేది. భవనం పాతది కావడంతో దానిని పడగొట్టి నూతనంగా నిర్మించడానికి టెండర్లు పిలిచారు. 2018లో ఓ కాంట్రాక్టరు టెండర్‌ దక్కించుకుని భవన నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. 2019లో పనులు ఆగిపోయాయి. ఆ సమయంలో డీసీసీబీ కొత్త భవనం నిర్మించుకోవడంతో దానికి సంబంధించిన పాత భవనం ఖాళీగా ఉండడంతో అక్కడికి శాఖ కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చారు. ఆ భవనానికి అద్దె, కరెంట్‌ బిల్లు చెల్లించేందుకు కూడా బడ్జెట్‌ రాకపోవడంతో దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత కొంగారెడ్డిపల్లెలోని ఓ భవనంలోకి మార్చారు. అక్కడా అద్దె చెల్లించక పోవడంతో ఖాళీ చేయాలని భవన యజమాని చెప్పడంతో ప్రస్తుతం ఎస్టేట్‌లో మరో భవనంలో అద్దెకు ఉంటున్నారు. ఈ భవనం చాలా చిన్నది కావడంతో ఇరుకుగా ఉండటంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత భవనాన్ని పూర్తి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 01:08 AM