Share News

బాబు భగీరథ ప్రయత్నం ఫలించిన వేళ!

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:04 AM

ఎక్కడి శ్రీశైలం.. ఎక్కడి కుప్పం? మధ్యలో 738 కిలోమీటర్ల దూరం. ప్రతిపక్ష వైసీపీ పాలనలో మధ్యలో అయిదేళ్లు నిర్లక్ష్యం. ఈ అయిదేళ్లకు అటు అయిదేళ్లు, ఇటు ఏడాది.. ఆరేళ్లపాటు సాగిన చంద్రబాబు భగీరథ ప్రయత్నం. హంద్రీ - నీవా బ్రాంచి కాలువ రూపంలో ముఖ్యమంత్రి సంకల్పం సాకారమైంది.

బాబు భగీరథ ప్రయత్నం ఫలించిన వేళ!
గుడుపల్లె సమీపంలో నిండుగా ప్రవహిస్తున్న హంద్రీ-నీవా కాలువ

పరుగులు పెట్టి కుప్పం చేరుకున్న కృష్ణమ్మ

కుప్పం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎక్కడి శ్రీశైలం.. ఎక్కడి కుప్పం? మధ్యలో 738 కిలోమీటర్ల దూరం. ప్రతిపక్ష వైసీపీ పాలనలో మధ్యలో అయిదేళ్లు నిర్లక్ష్యం. ఈ అయిదేళ్లకు అటు అయిదేళ్లు, ఇటు ఏడాది.. ఆరేళ్లపాటు సాగిన చంద్రబాబు భగీరథ ప్రయత్నం. హంద్రీ - నీవా బ్రాంచి కాలువ రూపంలో ముఖ్యమంత్రి సంకల్పం సాకారమైంది. కృష్ణమ్మ పరుగులు పెట్టి వచ్చి కరువు నేల కుప్పాన్ని పావనం చేస్తోంది. ఒక్క కుప్పమే కాదు.. హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ ఒడ్డున నిలబడిన రాయలసీమ మొత్తం పచ్చగా కళకళా చిరునవ్వులు చిందిస్తోంది. అదే కాలువ ఒడ్డున కుప్పం మండలం పరమసముద్రం చెరువు సమీపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నాడు జలహారతి ఇవ్వనున్నారు. ఆయనతో కలిసి నియోజకవర్గ ప్రజలందరూ గలగలా ప్రవహిస్తున్న కృష్ణమ్మకు సభక్తికంగా ప్రణమిల్లనున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1999 జూలై 9న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశారు. 2014-2019 మధ్య రూ.4,183 కోట్లు వ్యయం చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు నాటి పాలకులు గ్రహణం పట్టించి, రాయలసీమ మీద కక్షపూరితంగా వ్యవహరించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 100 రోజుల్లో ప్రధాన కాలువ విస్తరణ, లైనింగ్‌ పనులు పూర్తిచేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామ సమీపంలోని శ్రీశైలం ఆనకట్ట జలాశయంనుంచి ప్రారంభమవుతుంది.పుంగనూరు బ్రాంచి కెనాల్‌ 207.800వ కిలోమీటరు వద్ద పెద్దపంజాణి మండలం అప్పినపల్లె సమీపంలో కుప్పం బ్రాంచి కాలువ ప్రారంభమై 123 కిలోమీటర్లు ప్రయాణించి చిట్టచివరి గమ్యస్థానమైన కుప్పం మండలం పరమసముద్రం చెరువులో ఈ కాలువ కలుస్తుంది. ఈ కాలువను 215 క్యూసెక్కుల సామర్థ్యంతో, రూ.197 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత నెల 17వ తేదీన కర్నూలు జిల్లా మల్యాల ఎత్తిపోతల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీ-నీవా కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఆ నీళ్లు 738 కిలోమీటర్లు ప్రయాణించి ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించాయి. శాంతిపురం, గుడుపల్లె మండలాల మీదుగా కుప్పం మండలంలోని గమ్యస్థానమైన పరమసముద్రం చెరువుకు ఈనెల 25వ తేదీన కృష్ణా జలాలు చేరుకున్నాయి.వీటితో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 8 మండలాల పరిధిలో వున్న 110 చెరువులు నింపనున్నారు.తద్వారా 6,300 ఎకరాల భూమికి నీళ్లందనున్నాయి.4.02 లక్షలమందికి తాగునీటి లభ్యత కలగనుంది.

Updated Date - Aug 30 , 2025 | 01:04 AM