Share News

అన్‌లోడింగుకు దారేది?

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:20 AM

సంవత్సర కాలం కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి పంట రైతుకు కన్నీళ్లే మిగుల్చుతోంది.ఏదో ఒక ధరకు పంట అమ్ముకుందామనుకున్న రైతులు పల్ప్‌ పరిశ్రమల పర్మిట్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.

అన్‌లోడింగుకు దారేది?
తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద రైతుల పడిగాపులు

పల్ప్‌ పరిశ్రమల వద్ద మామిడి రైతుల అవస్థలు

గుడిపాల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): సంవత్సర కాలం కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి పంట రైతుకు కన్నీళ్లే మిగుల్చుతోంది.ఏదో ఒక ధరకు పంట అమ్ముకుందామనుకున్న రైతులు పల్ప్‌ పరిశ్రమల పర్మిట్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.ఎలాగోలా పర్మిట్‌ సంపాదించి ట్రాక్టర్‌లో మామిడి కాయలు తోలుకొస్తే పల్ప్‌ పరిశ్రమల ముందు రోజుల తరబడి అన్‌లోడ్‌ ఎప్పుడవుతాయా అని ఎదురుచూడాల్సివస్తోంది.దాదాపు 15రోజులుగా మామిడి తోటల్లోని కాయలు కొసుకొచ్చి జ్యూస్‌ ఫాక్టరీల వద్ద రైతులు రేయింబవళ్లు సరైన తిండీనిద్ర లేక అవస్థలు పడుతున్నారు.గుడిపాల మండలంలోని తాస, ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీల వద్ద బుధవారం కూడా నాలుగు కిలో మేటర్ల మేర మామిడి లోడ్డున్న ట్రాక్టర్లు బారులు తీరాయి.తాస ఫ్యాక్టరీ వద్ద సిఫార్సులు ఎక్కువగా ఉండడంతో తమను చిన్నచూపు చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిఫార్సున్న వారికే ప్రాధాన్యం

సిఫార్సులున్న వారికే తాస ఫ్యాక్టరీ సిబ్బంది ప్రాధాన్యత ఇస్తున్నారు.కాబట్టే రైతులు రోజుల కొద్దీ మామిడి కాయల అన్‌లోడింగ్‌ కోసం వేచి వుండాల్సి వస్తోంది. నాకు టోకెన్‌ వచ్చి ఐదు రోజులువుతున్నా లోపలకు అనుమతించలేదు. ఇందుకు కారణం నాకు సిఫార్సు లేకపోవడమే

-రమే్‌ష,బండపల్లె

రాత్రివేళ లారీలను అనుమతిస్తున్నారు

రాత్రి వేళల్లో లారీలను అనుమతించడం వలన సన్నకారు రైతులు అన్యాయమైపోతున్నారు. మామిడి కాయల అన్‌లోడింగుకు రోజులు పడుతుండడంతో ట్రాక్టర్‌ బాడుగలు చెల్లించ లేక, సమయానికి తిండి లేక నాలాంటి రైతులు అల్లాడిపోతున్నారు.అధికారులు వచ్చినప్పుడు హంగామా చేస్తున్న ఫ్యాక్టరీ సిబ్బంది వారు వెళ్లాక మా గోడు పట్టించుకోవడం లేదు.

-ప్రసాద రెడ్డి, యాదమరి

రెండు టన్నులు అమ్ముకోలేకపోతున్నా

నా తోపులో పండిన రెండు టన్నుల మామిడి కాయలను అమ్ముకోవడం నా వల్ల కావడం లేదు. కోత కోస్తామంటే ట్రాక్టర్‌ దొరకదు. ఒక వేళ ట్రాక్టర్‌ దొరికినా బాడుగలు రెండింతలు అడుగుతున్నారు.సరే అని తీసుకొస్తే ఇక్కడ రోజులు పడుతుండడంతో ట్రాక్టర్‌ బాడుగ కాకుండా అదనంగా రోజుకు రూ.500 అడుగుతున్నారు

-డిల్లి, గుడిపాల

రైతులకు సహకరించండి

-ఫ్యాక్టరీ యజమానులకు కలెక్టర్‌ సూచన

మామిడి రైతులకు ప్రభుత్వం అండగా ఉందని, వారికి గుజ్జు పరిశ్రమలు కూడా సహకరించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన గుడిపాల మండలంలోని ఫుడ్‌ అండ్‌ఇన్స్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడినుంచి తమిళనాడు రాష్ట్రం బాంబుల ఫ్యాక్టరీ వరకు బారులు తీరిన మామిడి కాయల ట్రాక్టర్ల వారితో మాట్లాడారు. ఎన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నారని, అందరికీ ఉచిత భోజనం అందుతోందా అని ఆరా తీశారు. అనంతరం తాసా ఫ్యాక్టరీకి చేరుకున్నారు.టోకెన్ల ప్రకారం మామిడి కాయలు అన్‌లోడ్‌ చేసుకోవడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.ఇకపై అలా జరగకుండా పర్యవేక్షించాలని తహసీల్దార్‌ శ్రీనివాసన్‌ను, ఎస్‌ఐ రామ్మోహన్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.జిల్లాలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల పంట రావాల్సి ఉండగా మూడు రెట్లు ఎక్కువగా రావడంతో ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాసులు, డీటీ లక్ష్మి, వ్యవసాయ అధికారిణి సంగీత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:20 AM