Share News

ఏం జరిగిందో.. ఏమో?

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:57 AM

ఆమెకు వివాహమైంది. మగబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డతో ప్రియుడి వద్దకు వచ్చేసింది. ముగ్గురూ కలిసి తిరుపతి రూరల్‌ మండలం దామినేడులో ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. అతడు ఫ్యానుకు వేలాడుతూ.. ఆమె, బిడ్డ బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడుండటం సోమవారం వెలుగు చూసింది.

ఏం జరిగిందో.. ఏమో?

దామినేడులో ముగ్గురి అనుమానాస్పద మృతి

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

తిరుచానూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఆమెకు వివాహమైంది. మగబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డతో ప్రియుడి వద్దకు వచ్చేసింది. ముగ్గురూ కలిసి తిరుపతి రూరల్‌ మండలం దామినేడులో ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. అతడు ఫ్యానుకు వేలాడుతూ.. ఆమె, బిడ్డ బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడుండటం సోమవారం వెలుగు చూసింది. ఆ గది తలుపునకు లోన గడియ పెట్టిఉండగా బయట తాళం వేసి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తిరుచానూరు ఎస్‌ఐ అరుణ తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తానికి చెందిన సత్యరాజ్‌(36), పూన్‌గొట్టాయి(21) ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లయింది. కుమారుడు మనీష్‌(3) ఉన్నాడు. ఆరు నెలల కిందట భర్తను వదలి ఆమె బిడ్దతో కలిసి సత్యరాజ్‌ వద్దకు వచ్చింది. ఈ ముగ్గురూ కలిసి తిరుపతి రూరల్‌ మండలం దామినేడు హౌసింగ్‌కాలనీలో అద్దెకు ఉంటూ కూలి పనులు చేసుకునేవారు. వారం కిందట తిరుపతిలోని తమ సమీప బంధువుతో మాట్లాడారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సోమవారం వారి బంధువులు ఇంటికి వచ్చారు. లోపల నుంచి దుర్వాసన వస్తోంది. బయట తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి తిరుచానూరు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ సునీల్‌కుమార్‌, ఎస్‌ఐ అరుణ, సిబ్బంది అక్కడికి వెళ్లారు. లోపల తలుపునకు గడియ పెట్టి ఉంది. తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లగా సీలింగ్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని సత్యరాజ్‌.. పక్కనే బాత్‌రూమ్‌లో పూన్‌గొట్టాయి, మూడేళ్ల మనీష్‌ విగతజీవులుగా పడున్నారు. వారం కిందట మృతి చెందినట్లు భావిస్తున్నారు. అనుమానాస్పద రీతిలో మృతిగా కేసు నమోదు చేసి మూడు మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. ముగ్గురూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా తల్లీ బిడ్డకు విషమిచ్చి సత్యరాజ్‌ ఉరేసుకున్నాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. లోపల గడియ వేసి ఉండటం.. బయట తాళం వేసి ఉండటంతో మరో కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 01:57 AM