Share News

‘మొంథా’ ఏం చేస్తుందో?

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:01 AM

భారీగా వర్షాలు పడి స్వర్ణముఖి నదీ మరింత ఉధ్రుతమైతే ఆ నాలుగు గ్రామాలకు ఇబ్బందే. ఈ క్రమంలో తమను ‘మొంథా’ తుఫాను ఏం చేస్తుందోనని కోట మండలంలోని ఆ గ్రామాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.

‘మొంథా’ ఏం చేస్తుందో?
కోట మండలం పుచ్చలపల్లి వద్ద కోతకు గురైన పొర్లుకట్ట

కోట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): భారీగా వర్షాలు పడి స్వర్ణముఖి నదీ మరింత ఉధ్రుతమైతే ఆ నాలుగు గ్రామాలకు ఇబ్బందే. ఈ క్రమంలో తమను ‘మొంథా’ తుఫాను ఏం చేస్తుందోనని కోట మండలంలోని ఆ గ్రామాల వారు బిక్కుబిక్కుమంటున్నారు. కోట మండలం రుద్రవరం నుంచి గూడలి మీదుగా తిన్నెలపూడి వరకు ఆరు కిలోమీటర్లు.. పుచ్చలపల్లి నుంచి దొరువుకట్ట వరకు 16 కిలోమీటర్లు స్వర్ణముఖినది ఉంది. ఈ నదికి రెండువైపులా పొర్లుకట్టలు బలహీనంగా మారాయి. పదేళ్లుగా వీటికి శాశ్వత మరమ్మతులు చేయలేదు. దీంతో చాలాచోట్ల కట్టలు పగుళ్లిచ్చాయి. మట్టి జారిపోయాయి. దీంతో స్వర్ణముఖికి ఉధృత ప్రవాహం వస్తే ఎలాగంటూ సమీప ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొంథా తుఫాను ప్రభావంవల్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో వాకాడు బ్యారేజీ నుంచి పుచ్చలపల్లి, అల్లంపాడు, దైవాలదిబ్బ, దొరువుకట్ట గ్రామాలమీదుగా వెళ్లే స్వర్ణముఖినదిలోకి 4,500 క్యూసెక్కుల వరదనీటిని వదిలారు. ఇప్పటికే పుచ్చలపల్లి వద్ద స్వర్ణముఖి కరకట్టలు ధ్వంసమై ఉన్నాయి. ఇంకొంచెం ప్రవాహం పెరిగితే ప్రమాదమేనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంతో పాటు 1200 ఎకరాలకు ముప్పేనని అంటున్నారు. అల్లంపాడు, దొరువుకట్ట, దైవాలదిబ్బతోపాటు మజరా గ్రామాల్లో ఉన్న దళిత, గిరిజన కాలనీలు కూడా ఆయా స్వర్ణముఖి పొర్లుకట్టల కింద ఉన్నాయి. ఆయా కట్టలన్నీ గతేడాది వచ్చిన వర్షాలు, వరదలకు పూర్తిగా కోతకు గురై ఉన్నాయి. ఈ క్రమంలో స్థానికుల్లో ‘మొంథా’ ఏం చేస్తుందోనన్న భయాందోళన నెలకొంది. మరోవైపు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం ఈ పొర్లుకట్టలను పరిశీలించారు. ఏ క్షణంలో నైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున సుమారు 4 గ్రామాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిన్నమొన్నటి వరకు ధైర్యంగా ఉంటూ వచ్చిన ఆయా గ్రామాల ప్రజలు ఎప్పుడు స్వర్ణముఖినది కన్నెర్రచేస్తుందోనన్న ఆందోళనతో భయంభయంగా గడుపుతున్నారు.

అధికారులూ.. అప్రమత్తతంగా ఉండండి

కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0877-2236007

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. తుఫాన్‌ కారణంగా సోమవారం మండలం, డివిజన్‌, కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎ్‌సను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రమాదకర పరిస్థితులుంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌ 0877-2236007 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. డీఆర్వో నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు : కలెక్టర్‌

వాకాడు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్‌ నేపథ్యంలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఆదివారం ఆయన ఏర్పేడు, శ్రీకాళహస్తి, కోట, వాకాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. చెరువులు, నదులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ రోప్‌లను, బాలిరెడ్డిపాళెం వద్ద ముంపు ప్రాంతాన్ని చూసిన ఆయన.. స్వర్ణముఖి బ్యారేజీకి భారీ వరద వచ్చే అవకాశం ఉండడంతో గేట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 27, 28, 29 తేదీల్లో 90నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రతీర ప్రాంత మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికే ఒడ్డుకు రప్పించామన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రత్యేక రక్షణ బృందాలను అందుబాటులో ఉంచామని వివరించారు. ఆక్రమణకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను గుర్తించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో గూడూరు ఇన్‌చార్జి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ సందీప్‌ రఘువంశి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాధాకృష్ణమూర్తి, తహసీల్దారు సయ్యద్‌ ఇక్బాల్‌, ఎంపీడీవో సాయిప్రకాష్‌, ఇరిగేషన్‌ బ్యారేజీ ఏఈ శ్రీనివాసరావు, పీఆర్‌ ఏఈ కిరణ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సుమాంజలి, ఎంఈవో నసీం ఆలీ, విద్యుత్‌శాఖ ఏఈ విజయలక్ష్మి, ఏవో దీప, టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదనరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సహాయక చర్యలకు అదనంగా రూ.కోటి

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ నేపథ్యంలో తక్షణ సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19కోట్లు మంజూరు చేసింది. అందులో తిరుపతి జిల్లాకు రూ.కోటి కేటాయించింది. ఇప్పటికే రూ.2కోట్లు విడుదలచేసిన విషయం తెలిసిందే. తుఫాన్‌ ప్రభావంఎక్కువగా ఉన్న తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రూ.కోటి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు రూ.50లక్షలు చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది.

మూడు రోజులు బ్లాస్టింగ్‌ నిషేధం

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని క్వారీ కౌలుదారులు మూడు రోజులపాటు క్వారీల్లో బ్లాస్టింగ్‌ చేయకూడదని జిల్లా మైన్స్‌ అధికారులు తెలిపారు. కార్మికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. మొంథా తుఫానుతో ఏదైనా నష్టం జరిగితే జిల్లా యంత్రాంగంతో కలసి మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

Updated Date - Oct 27 , 2025 | 02:01 AM