పసికందు ఏం చేసింది పాపం
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:28 AM
మహిళల మధ్య వివాదంలో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం మేరకు మదనపల్లె సమీపంలో బి.కొత్తకోటకు చెందిన క్రిష్ణానాయక్, ప్రసన్నలకు 8ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు చంద్రగిరిలో మూలస్థాన ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉంటున్నారు.
బిడ్డ చేతిలో ఉండగా తల్లిపై దాడి
తీవ్రంగా గాయపడి ప్రాణం విడిచిన చిన్నారి
చంద్రగిరి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మహిళల మధ్య వివాదంలో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం మేరకు మదనపల్లె సమీపంలో బి.కొత్తకోటకు చెందిన క్రిష్ణానాయక్, ప్రసన్నలకు 8ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరు చంద్రగిరిలో మూలస్థాన ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉంటున్నారు. గత ఏడాది జూలై 31న క్రిష్ణానాయక్ మృతి చెందాడు. అప్పటికే ప్రసన్న గర్బవతి. పాప దీక్షితాప్రియకు జన్మనిచ్చింది. ఇటీవల తిరుపతి కొర్లగుంటలో ఉంటున్న మిట్టపాలెంకు చెందిన సుబ్రమణ్యం, ప్రసన్నల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సుబ్రమణ్యం భార్య ఉమ, మరో మహిళ దుర్గ మంగళవారం ప్రసన్న ఇంటికి వచ్చారు. గట్టిగా ఆమెతో గొడవ పడ్డారు. ఈక్రమంలో ప్రసన్నపై ఉమ దాడి చేసింది. అదే సమయంలో ఆమె చేతిలో ఉన్న ఏడాది బిడ్డ దీక్షితాప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందినట్లు నిర్థారించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దీక్షితాప్రియ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.