శ్రీనివాసులు హత్యకు కారణాలేమిటి?
ABN , Publish Date - Jul 15 , 2025 | 02:01 AM
జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి వినుత మాజీ పీఏ శ్రీనివాసులు హత్యకు కారణాలేమిటన్నది అంతుబట్టడం లేదు. పాతికేళ్ల యువకుడిని పలుమార్లు చిత్రహింసలకు గురి చేశారని, దెబ్బలకు తట్టుకోలేకే అతడు చనిపోయాడని చెన్నై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఆరా తీస్తున్న చెన్నై పోలీసులు
దర్యాప్తులో సహకరించేందుకు చెన్నైకి రేణిగుంట సీఐ
తిరుపతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి వినుత మాజీ పీఏ శ్రీనివాసులు హత్యకు కారణాలేమిటన్నది అంతుబట్టడం లేదు. పాతికేళ్ల యువకుడిని పలుమార్లు చిత్రహింసలకు గురి చేశారని, దెబ్బలకు తట్టుకోలేకే అతడు చనిపోయాడని చెన్నై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు గురైంది కూటమి ప్రభుత్వంలోని అధికార పార్టీకి చెందిన మహిళా నేత డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడూ కావడంతో ఇది సంచలనంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల వర్గాలతో పాటు సామాన్య జనం కూడా హత్య వెనుక వాస్తవాలు తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది చెన్నై పోలీసులు కావడంతో హత్యపై సస్పెన్స్ కొనసాగుతోంది
నిందితుల కస్టడీకి పిటిషన్
శ్రీకాళహస్తి మండలం బొక్కిసపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మృతదేహం చెన్నైలో లభించడంతో అక్కడి సెవెన్ వెల్స్ ప్రాంత పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రాథమిక దర్యాప్తులో శ్రీనివాసులు మృతికి శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబు, వారి ముగ్గురు అనుచరులు కారకులని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు పంపించారు. అరెస్టుకు, రిమాండుకు పంపడానికి నడుమ పెద్దగా వ్యవధి లభించకపోవడంతో వారు నిందితులను లోతుగా విచారించలేదని తెలిసింది. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. ఇపుడు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే హత్యకు దారి తీసిన కారణాలేమిటన్నది తెలుస్తాయని చెన్నై పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా వారు అక్కడి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ లోపు చెన్నై పోలీసు కమిషనరేట్ నుంచీ వచ్చిన అభ్యర్థనతో కేసు దర్యాప్తులో సహకరించేందుకు రేణిగుంట సీఐని చెన్నై వెళ్లాల్సిందిగా జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజు ఆదేశించారు. దీంతో రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు కేసు దర్యాప్తులో చెన్నై పోలీసులకు సహకరించడానికి రేణిగుంట సీఐ హుటాహుటిన చెన్నై బయల్దేరి వెళ్ళారు.
హత్యకు ఇవేనా.. కారణాలు?
చెన్నై పోలీసులు నిందితులను ప్రాథమికంగా విచారించిన సందర్భంలో రెండు కారణాలు హత్యకు దారి తీసివుండవచ్చని భావించినట్టు తెలిసింది. వీటిలో ఒకటి వివాహేతర సంబంధం కాగా మరోటి వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరవేయడం అని చెన్నై పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాసులు తొలుత వినుతకు కారు డ్రైవరుగా నియమితులయ్యారని, తర్వాత క్రమంగా వ్యక్తిగత సహాయకుడిగా కూడా మారాడని తెలిసింది. ఆ కుటుంబానికి బాగా సన్నిహితంగా మారాడు. శ్రీకాళహస్తి, చెన్నై తదితర ప్రాంతాల్లో కొనసాగించిన వ్యక్తిగత వ్యవహారాలు, సెటిల్‌మెంట్లు వంటి వివరాలు శ్రీనివాసులు వద్ద వున్నట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. వాటిని చూపి బ్లాక్‌మెయిల్ చేయడం, వినుత ప్రత్యర్థులకు వాటిని అందించడం వంటివేవో జరిగాయని అనుమానిస్తున్నారు. వినుత దంపతులు శ్రీనివాసులును పీఏగా తొలగిస్తున్నట్టు విడుదల చేసిన ప్రకటనలో కూడా ‘అతడు తమ ప్రాణ, గౌరవాలకు భంగం కలిగించాడు’ అని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ఈ దిశగానే విచారిస్తున్నారు.
దూకుడు రాజకీయాలతో ఒంటరైన వినుత
కాగా, రాజకీయంగా బలం లేకపోయినా వినుత వర్గం దూకుడుగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలతో పాటు కూటమి పార్టీల నేతలతో కూడా వ్యక్తిగత వైరాన్ని కొనితెచ్చుకున్నట్టు నియోజకవర్గంలో ప్రచారమవుతోంది. చివరికి సొంత పార్టీలో కూడా అందరూ దూరమయ్యారని, ఇరుగుపొరుగు నియోజకవర్గాల నేతలు, జిల్లా నేతలతోనూ సత్సంబంధాలు లేవని జనసేన వర్గాలే చెబుతున్నాయి. ఒకరకంగా నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ రాజకీయంగా వినుత ఒంటరిగా మారినట్టయిందని సమాచారం. ఆ క్రమంలో వినుత పీఏగా ఉండిన శ్రీనివాసులు ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు నేతలకు టచ్‌లోకి వెళ్లారని, వినుత వర్గానికి చెందిన అభ్యంతరకర అంశాలు, ఫొటోలు, వీడియోలు, సమాచారం వారికి అందజేశాడనే ఆరోపణలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు వాటిని ఎప్పటికప్పుడు జనసేన అధిష్ఠానానికి చేరవేశారని సమాచారం. వినుతను జనసేన నుంచీ బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం జారీ చేసిన ప్రకటనలో సైతం గత కొంతకాలంగా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వినుత వ్యవహార శైలి వుందని పేర్కొన్న సంగతి ఈ సందర్భంగా గమనించాల్సి వుంది. మొత్తానికీ శ్రీనివాసులు హత్య కేసుతో వినుత రాజకీయ భవిష్యత్తు దెబ్బతిన్నట్టయింది.