రౌడీషీటర్లు ఏం చేస్తున్నారు?
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:52 AM
పోలీసు స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు ఎంత మంది ఉన్నారు?
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పోలీసు స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు ఎంత మంది ఉన్నారు? ఇంకా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా? శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారా? నాయకులతో అంటకాగుతూ సెటిల్మెంట్లు చేస్తున్నారా? ఈ దిశగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నెల్లూరు జైలులో ఉంటూ శ్రీకాంత్ సెటిల్మెంట్లు చేయడం.. లేడీ డాన్ అరుణ ఘటన నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపేలా చర్యలు చేపడుతున్నారు. మళ్లీ మళ్లీ నేరాలు చేస్తున్న రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తాజాగా డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా ఆదేశాలివ్వడంతో పోలీసు అధికారులు స్పందించారు. కాగా, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు జిల్లాలో దాదాపు 860 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో 150 నుంచి 200 మంది యాక్టివ్‌గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెదులుతున్న వారెందరనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. గత ఏడాది కాలంలో రౌడీషీటర్లు ఎక్కడైనా మళ్లీ హత్యలు, హత్యాయత్నాలు, ఇతర గ్రేవ్ నేరాల్లో పాల్గొన్నారా అనేది పరిశీలిస్తున్నారు. పాత రికార్డులు తిరగతోడుతున్నారు. గతంలో రౌడీషీటర్లుగా నమోదైన వారి జాబితా బయటకు తీస్తున్నారు. గతంలో ప్రతి వారం స్టేషన్లకు రౌడీషీటర్లను పిలిపించుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపేవారు. స్టేషన్ల వారీగా టాప్-10 లో ఉన్న షీటర్లను గుర్తించి పాత కేసుల్లో పాత్ర ఉన్న వారిని, వారం, వారం గైర్హాజరైన వారిని ఎంపిక చేస్తున్నారు. మొత్తంగా నేర చరిత్ర ఉన్న వారిని జైలుకు పంపడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలతోనూ రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఈ అంశాన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
785 మంది నేరస్థుల వేలి ముద్రల సేకరణ
జిల్లా వ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో దాదాపు 785 మంది నేరస్థుల వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు ఆగస్టు నెల నేర సమీక్ష గణాంకాలను మంగళవారం ఎస్పీ హర్షవర్ధనరాజు మీడియాకు విడుదల చేశారు. ‘రాత్రి పూట రోడ్లపై తిరుగుతున్న 1260 మంది అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చాం. 785 మంది వేలిముద్రలు తీసుకున్నాం. 65.600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు పెట్టాం. 791 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చాం. బహిరంగంగా మద్యం తాగుతున్న 1209 మందిపై కేసులు నమోదు చేశాం. 2185 సమస్యాత్మక వార్డులు, గ్రామాలను డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సందర్శించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. డ్రోన్ల ద్వారా 127 ఆపరేషన్లు చేశాం. గ్రామాల్లో పల్లెనిద్ర చేయగా.. 463 హోంస్టేలు తనిఖీలు చేసి కొన్నింటిపై కేసులు పెఆ్టం. కార్డన్‌సెర్చ్ నిర్వహించి, 60 వాహనాలు సీజ్ చేశాం’ అని ఆ ప్రకటనలో ఎస్పీ వివరించారు. చట్టాలను అతిక్రమించే వారిని ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.