తుడా అభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - May 22 , 2025 | 02:12 AM
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్‌గా డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తుడా కార్యాలయంలో వీసీ మౌర్య, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి, మే 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్‌గా డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తుడా కార్యాలయంలో వీసీ మౌర్య, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. సాయంత్రం పెరుమాళ్లపల్లె నుంచి ద్విచక్రవాహనాల్లో ర్యాలీగా వచ్చారు. టౌన్ క్లబ్ కూడలి నుంచి ఓపెన్ టాప్ వాహనంపై ర్యాలీగా ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఏర్పాటుచేసిన వేదికవద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, మురళీకృష్ణ, విజయశ్రీ, కురుగొండ్ల రామకృష్ణ, సునీల్ కుమార్, టీటీడీ సభ్యురాలు పనబాక లక్ష్మి, మాజీ మంత్రి పరసా రత్నం తదితరులు పాల్గొని డాలర్స్ దివాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్లలో తుడాను తుడిచిపెట్టిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై వేగవంతంగా చర్యలు తీసుకునేందకు దివాకర్ కృషిచేయాలన్నారు. అనంతరం తుడా ఛైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఇచ్చిన బాధ్యతకు చెడ్డపేరు తీసుకురానని చెప్పారు. భగవంతుడి సాక్షిగా తుడాలో తప్పుచేయనన్నారు. దుష్టుడు, దుర్మార్గుల పాలన నుంచి తుడా విముక్తి అయిందన్నారు. తనను అవమానించిన చోటే తిరిగి ఛైర్మన్‌గా వచ్చానన్నారు. డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ పరిచయకర్తగా వ్యవహరించిన ఈకార్యక్రమంలో కూటమి నాయకులు నరసింహ యాదవ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మబ్బు దేవనారాయణ రెడ్డి, కోలా ఆనంద్, దయాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, రుద్రకోటి సదాశివం, పులుగోరు మురళీకృష్ణారెడ్డి, ఊట్ల సురేంద్ర నాయుడు, అన్నా అనిత, కుమారమ్మ, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.