Share News

మణీంద్రం పారిశ్రామికవాడకు భూములివ్వం

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:25 AM

రామకుప్పం మండలం మణీంద్రంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడకు భూములిచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. మండల పరిఽదిలో ఏర్పాటు కానున్న విమానాశ్రయానికి చేరువలో నియోజకవర్గ ప్రజలకు ఉపాఽధి, ఉద్యోగ కల్పన కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది

మణీంద్రం పారిశ్రామికవాడకు భూములివ్వం
రామకుప్పం-విజలాపురం రహదారిపై బైఠాయించిన రైతుకుటుంబాలు

రామకుప్పం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలం మణీంద్రంలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడకు భూములిచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. మండల పరిఽదిలో ఏర్పాటు కానున్న విమానాశ్రయానికి చేరువలో నియోజకవర్గ ప్రజలకు ఉపాఽధి, ఉద్యోగ కల్పన కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మణీంద్రం గ్రామ దాఖలాలో రైతుల నుంచి 600 ఎకరాల సేకరణ మొదలెట్టింది. ఇప్పటికే పలు పరిశ్రమల ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించి భూములను పరిశీలించారు. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.కొన్ని రోజులుగా రెవిన్యూ సిబ్బంది భూముల్లో నమూనాలను కూడా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత శ్రీరాములురెడ్డి, వైసీపీ నేత చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రామకుప్పం-విజలాపురం రహదారిపై బైఠాయించారు. తాము ఇప్పటికే విమానాశ్రయం, హంద్రీ-నీవా కాలువలకు భూములిచ్చామని, మళ్లీ 600ఎకరాలు ఇవ్వలేమన్నారు. ఉన్న కొద్దిపాటి భూముల్లో సేద్యం చేసుకుంటూ పాడిపరిశ్రమనే నమ్ముకుని జీవిస్తున్నామన్నారు. పరిశ్రమలకు భూములిచ్చేస్తే వీధిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచించి తమను ఆదుకోవాలని కోరారు.ఆందోళన విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ మహేంద్ర అక్కడకు వెళ్ళి రైతులతో చర్చించారు. ఏదైనా ఉంటే అధికారులను కలిసి మాట్లాడాలని రైతులకు సూచించారు. దీంతో వారు ఆందోళన విరమించి గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. కాసేపటికి అక్కడికి వీఆర్వో తేజ్‌రెడ్డి వచ్చారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చేది లేదని,ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాలని ఆయనకు వినతిపత్రం అందించారు.

Updated Date - Sep 20 , 2025 | 01:26 AM