Share News

మామిడికి మద్దతు ధర ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:16 AM

ప్రభుత్వం పేర్కొన్న విధంగా మామిడికి మద్దతు ధర కిలోకు రూ.8 ఇవ్వాల్సిందేనని రైతులు డిమాండ్‌ చేశారు.

మామిడికి మద్దతు ధర ఇవ్వాల్సిందే!
రాస్తారోకో చేస్తున్న మామిడి రైతులు

గుడిపాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేర్కొన్న విధంగా మామిడికి మద్దతు ధర కిలోకు రూ.8 ఇవ్వాల్సిందేనని రైతులు డిమాండ్‌ చేశారు. ‘కిలోకు మీరిచ్చే మూడు, నాలుగు రూపాయలు మాకొద్దు.. కాలాతీతం చేయడం వల్ల మద్దతు ధరకు మరో రూపాయి కలిపి ఇవ్వాలంటూ మంగళవారం గుడిపాల మండలంలోని కొత్తపల్లె వద్ద ఉన్న జాతీయ రహదారిపై మామిడి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు హరిబాబు చౌదరి, కార్యదర్శి ఆనందనాయుడు మాట్లాడుతూ.. జూలై నెలలో రైతు ఎన్నో అవస్థలుపడి మామిడి కాయలను ఫ్యాక్టరీలకు తోలారన్నారు. చివరకు ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరను కూడా ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఇవ్వకుండా రైతుల కడుపు కొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ సాయినాథ్‌, సీఐ శ్రీధర్‌నాయుడు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామ్మోహన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో చర్చించారు. ఫ్యాక్టరీల యాజమాన్యాలు, కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రైతులు రవీంద్రనాయుడు, మురళినాయుడు, శేఖర్‌నాయుడు, శంకర్‌చౌదరి, చల్లా తదితరులు పాల్గొన్నారు.

అరగంటపాటు స్తంభించిన ట్రాఫిక్‌

రైతుల రాస్తారోకోతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి.

Updated Date - Dec 03 , 2025 | 12:16 AM