ఎస్వీయూ కృషిలో విజన్-2047 ప్రతిఫలిస్తోంది
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:44 AM
నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎస్వీయూ కృషిలో విజన్-2047 ప్రతిఫలిస్తోందని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ పేర్కొన్నారు. ఎస్వీయూ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ సంయుక్తంగా శుక్రవారం సెనెట్ హాలులో చేపట్టిన కార్యక్రమంలో ‘పరిశోధనావిష్కరణలు- ద విజన్ ఆఫ్ వికసిత భారత్’ అంశంపై ఆయన ప్రసంగించారు. 2047 నాటికి మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఒక ఆకర్షణీయమైన రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేసుకుందన్నారు. దీనికి అవసరమైన కృషిని దేశంలోని అన్ని సంస్థలు, పౌరులు నెరవేర్చాల్సి ఉందన్నారు. తదనుగుణంగా ఆయా సంస్థలు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కోరారు. అంతరిక్షంలో శాస్త్రీయ సాంకేతిక నాయకత్వం, కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, క్వాంటం కంప్యూటింగ్, పునరుత్పాదక శక్తి, వాతావరణ చర్యతో సహా స్థిరత్వం, గ్రీన్ గ్రోత్, ట్రిలియన్ డాలర్ల డిజిటల్ మార్కెట్‌ను ముందుకు నడిపించే ఏఐ ఆధారిత స్టార్ట్‌పలు, డిజిటల్ ఎకానమీ, శక్తిమంతమైన విశ్వవిద్యాలయాల పరిశోధనలు, పేటెంట్లు, యువత నేతృత్వంలో జరిగిన ఆవిష్కరణల వంటివి వికసిత భారత్ లక్ష్యాన్ని నెరవేర్చడానికి దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నాణ్యమైన పరిశోధనలు మంచి ఉపాధి అవకాశాలను కూడా సృష్టించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకుల సందేహాలను డాక్టర్ వీకే సారస్వత్ నివృత్తి చేశారు. ఇంక్యుబేషన్ పరిశ్రమ భాగస్వామ్యాలను ఎస్వీయూ విస్తరిస్తున్నట్లు వీసీ నరసింగరావు చెప్పారు. పేటెంట్లు, ప్రోటోటై్‌పలు, స్టార్ట్‌పలలో ముగియబోతున్న ప్రాజెక్టులను కొనసాగించడానికి ప్రోత్సహిస్తుందన్నారు. ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలలో స్కాలర్‌షి్‌పలు, మార్గదర్శకత్వం అనుకూలమైన వాతావరణం మెరుగు పడ్డాయని పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఉమ తెలిపారు. మన దేశం అంతరిక్ష, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి, సెమీకండక్టర్లు వంటి రంగాలలో పురోగతిని సాధించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ కార్యదర్శి నారాయణరావు తెలిపారు. ఈకార్యక్రమంలో రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, సీడీసీ డీన్ చెండ్రాయుడు, మాజీ వీసీ మురళి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.