Share News

కంటికి కనిపించే దేవుళ్లు... మన డాక్టర్లు

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:32 AM

వైద్యోనారాయణో హరి అనే నానుడి ప్రకారం వైద్యుడు భగవంతుడైన నారాయణుడి స్వరూపం. వైద్యులను భగవంతుడిలా చూస్తారు కాబట్టే రోగులు వారి శరీరాన్ని పరీక్షించేందుకు నిరభ్యంతరంగా వైద్యులకు అప్పగిస్తారు. తమ సొంత కుటుంబ సభ్యులకు సైతం వెల్లడించని రహస్య సమాచారాన్ని వైద్యులకు మాత్రమే తెలిపే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ స్థాయిలో నమ్మకం, విశ్వాసాన్ని పొందడమనేది అమరే ఇతర వృత్తిలోనూ ఉండకపోవచ్చు. ప్రజల నుంచి ఇంతలా విశ్వాసాన్ని పొందుతున్న వైద్యవర్గం ఎప్పుడూ దానికి తగినంత ప్రాధాన్యతనివ్వాలి. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. దానికోసం వైద్యులు అత్యున్నతస్థాయి నైతిక విలువలతో విధుల పట్ల అత్యంత అంకితభావాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వైద్యులు తాము అత్యంత ప్రాధాన్యతన విలువలు కలిగివున్నారనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుంచుకొని దానికి తగిన విధంగా మెలగాలి. అయితే కొన్నేళ్లుగా పలు కారణాల వలన వైద్యుల పనితీరు, వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న మరికొందరు వైద్యుల వలన దురదృష్టవశాత్తు వైద్యుల, రోగుల మధ్య ఉన్న బంధం సన్నగిల్లుతుంది. రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం అనే డైలాగ్‌ ప్రతీ ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు జన్మనిస్తే డాక్టరు పునర్జన్మనిస్తాడు అనే విషయం కూడా మనం నమ్మాల్సిన విషయమే. ఇటువంటి పరిస్థితుల్లో గత అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, రోగులు ఇద్దరిపైనా ఉంది. ఇటువంటి అద్వితీయ అనుబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వైద్యుల దినోత్సవం కన్నా మంచి తరుణం దొరకదు.

కంటికి కనిపించే దేవుళ్లు... మన డాక్టర్లు
డాక్టర్‌ బాలకృష్ణనాయక్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

- డాక్టర్లు, రోగుల మధ్య బలహీనపడుతున్న బంధం

- రోగుల నమ్మకాన్ని సంపాదించుకోవాల్సిన తరుణం

- నేడు జాతీయ వైద్యుల దినోత్సవం

తిరుపతి(వైద్యం), జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వైద్యోనారాయణో హరి అనే నానుడి ప్రకారం వైద్యుడు భగవంతుడైన నారాయణుడి స్వరూపం. వైద్యులను భగవంతుడిలా చూస్తారు కాబట్టే రోగులు వారి శరీరాన్ని పరీక్షించేందుకు నిరభ్యంతరంగా వైద్యులకు అప్పగిస్తారు. తమ సొంత కుటుంబ సభ్యులకు సైతం వెల్లడించని రహస్య సమాచారాన్ని వైద్యులకు మాత్రమే తెలిపే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ స్థాయిలో నమ్మకం, విశ్వాసాన్ని పొందడమనేది అమరే ఇతర వృత్తిలోనూ ఉండకపోవచ్చు. ప్రజల నుంచి ఇంతలా విశ్వాసాన్ని పొందుతున్న వైద్యవర్గం ఎప్పుడూ దానికి తగినంత ప్రాధాన్యతనివ్వాలి. తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి. దానికోసం వైద్యులు అత్యున్నతస్థాయి నైతిక విలువలతో విధుల పట్ల అత్యంత అంకితభావాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. వైద్యులు తాము అత్యంత ప్రాధాన్యతన విలువలు కలిగివున్నారనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుంచుకొని దానికి తగిన విధంగా మెలగాలి. అయితే కొన్నేళ్లుగా పలు కారణాల వలన వైద్యుల పనితీరు, వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న మరికొందరు వైద్యుల వలన దురదృష్టవశాత్తు వైద్యుల, రోగుల మధ్య ఉన్న బంధం సన్నగిల్లుతుంది. రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం అనే డైలాగ్‌ ప్రతీ ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు జన్మనిస్తే డాక్టరు పునర్జన్మనిస్తాడు అనే విషయం కూడా మనం నమ్మాల్సిన విషయమే. ఇటువంటి పరిస్థితుల్లో గత అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, రోగులు ఇద్దరిపైనా ఉంది. ఇటువంటి అద్వితీయ అనుబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు వైద్యుల దినోత్సవం కన్నా మంచి తరుణం దొరకదు.

- జీవితకాలం దేశీయ వైద్యరంగంలో మౌళిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన భారతరత్న పురష్కార గ్రహీత డాక్టర్‌ బీసీరాయ్‌ స్మారకార్థం 1991 నుంచి ఏటా జూలై ఒకటిన దేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తారు. వైద్యుల దినోత్సవం అనేది కేవలం డాక్టర్‌ బీసీరాయ్‌ను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తమ వైద్యపరమైన నైపుణ్యాలతో ఎంతో మంది జీవితాలను మెరుగుదిద్ధి ఎన్నో ప్రాణాలను కాపాడిన వైద్యులందరికీ అంకితం. నేటి డాక్టర్లు డాక్టర్‌ బీసీరాయ్‌ వంటి మహనీయులు చేసిన విధంగా రోగులకు వైద్యసేవలు అందించకపోయినా వృత్తేదైవంగా బావించి రోగులకు నిస్వార్థమైన సేవలను అందిస్తే డాక్టర్లను దేవుళ్లుగా చూసే రోజులు మళ్లీ వస్తాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డాక్టర్లు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు : డాక్టర్‌ బాలకృష్ణనాయక్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

- ఇతరుల ప్రాణాలను కాపాడగలిగే గొప్ప అవకాశం ఒక్క డాక్టర్లకు మాత్రమే ఉంటుంది. అటువంటి డాక్టర్ల వృత్తిలో రాణించడమనేది గత జన్మ పుణ్య ఫలంలా భావించాలి. అంతేకానీ డాక్టరు వృత్తిని వ్యాపారంగా చూడకూడదు. ప్రస్తుత కాలంలో రోగులకు నిస్వార్థ సేవలు అందించాలనే ఆలోచనతో వైద్య వృత్తిలోకి వచ్చే వారికంటే వైద్య వ్యాపారం బాగుటుందనే ఆలోచనతో వైద్య వృత్తిలో అడుగు పెట్టే వారే ఎక్కువగా ఉన్నారు. అందువలనే ప్రజలకు వైద్యులపై నమ్మకం సన్నగిల్లుతుంది. కానీ నిస్వార్థంగా వైద్యసేవలు అందించే వారు కూడా ఉన్నారనే విషయాన్ని ప్రజలు కూడా విశ్వసించాలి. కార్పోరేటు ఆస్పత్రుల విషయం పక్కన పెడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు మాత్రం నూరు శాతం ప్రజల ఆరోగ్య భద్రత కోసమే కృషి చేస్తున్నారనేది సత్యం.

ప్రజలకు డాక్టర్లపై నమ్మకాన్ని పెంచే విధంగా వృత్తిలో రాణించాలి : డాక్టర్‌ రవిప్రభు, ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌

- వైద్యవృత్తిలో అడుగు పెట్టే విద్యార్థులు ప్రజల ఆరోగ్యభద్రతే ద్యేయంగా భావించి రావాలి. అలాగే ప్రజలకు డాక్టర్లపై నమ్మకాన్ని పెంచే విధంగా వృత్తిలో రాణించాలి. అందుకనే వైద్య విద్యార్థులకు కేవలం వైద్యపరంగానే కాకుండా వైద్యుల నైతిక విలువలు, సమాజంలో వైద్యుల పాత్ర వంటి విషయాలపై ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రముఖలతో అతిధి ఉపన్యాసాలు కొనసాగిస్తున్నాము. వైద్య వృత్తి అనేదే దేవుడు మనకు ఇచ్చిన ఒక వరం. అటువంటి వైద్యులను తీర్చిదిద్ధే అవకాశం కల్పించడం నిజంగా నా గత జన్మ సుకృతం. నాకు కల్పించిన ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవడంతోపాటు నైతిక విలువలు కలిగిన వైద్యులను సమాజానికి అందించేందుకు నా వంతు కృషి చేస్తాను.

రోగుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా మా వంతు కృషి చేస్తున్నాము : డాక్టర్‌ రాధ, రుయాస్పత్రి సూపరింటెండెంట్‌

- ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువగా నిరుపేదలే ఉంటారు. అటువంటి వారు ఇక్కడ డాక్టర్లపై ఉన్న నమ్మకంతోనే వస్తారు. అటువంటి వారి ఆరోగ్య భద్రతే లక్ష్యంగా వైద్యసేవలు అందిస్తున్నాము. రోగులకు వైద్యంతోపాటు వారిలో మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందించే విధంగా వారితో మాట్లాడాలని ఆస్పత్రిలోని డాక్టర్లకు నిత్యం పేర్కొంటున్నాము. అదే తరహాలో రోగులతో డాక్టర్లు మలుచుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యవృత్తిలో రాణించే అవకాశం నాకు దొరకడం నా అదృష్టంగా బావిస్తున్నాను. నా వంతుగా నిత్యం రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కృషి చేస్తాను. అదే విషయాన్ని నాతోటి డాక్టర్లకు చెబుతుంటాను.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నేటి సమాజంలో చాలా కష్టతరంగా మారుతుంది : డాక్టర్‌ కృష్ణప్రశాంతి, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌

- నేటి సమాజంలో వైద్య వృత్తిని వ్యాపారంగా చూస్తున్న కొందరు డాక్టర్ల వలన ప్రజలకు డాక్టర్లపై నమ్మకం కోల్పోతున్న మాట వాస్తవమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టతరంగానే ఉన్నా మనం నిస్వార్థంగా వైద్యసేవలు అందిస్తే ప్రజలు ఎప్పుడు డాక్టర్లను దేవుళ్లుగానే చూస్తారనేది నా నమ్మకం. ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఆ దేవుడు మనకు ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలనేదే నా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా నిత్యం నా పయనం సాగిస్తూనే ఉంటాను.

డాక్టరు వృత్తిలో రాణించడమనేది దేవుడు ఇచ్చిన వరంలా భావించాలి : డాక్టర్‌ డీబీ శశిధర్‌రెడ్డి, సీనియర్‌ డాక్టర్‌

- డాక్టరు వృత్తిలో రాణించడమేది దేవుడు మనకు కల్పించిన వరంలా భావించాలి. అలా భావించడంతోపాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వారికి వైద్య సేవలు అందించాలి. వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా అదొక సమాజ సేవలా చూడాలి. ప్రవేటు ఆస్పత్రులు అంటేనే ఆస్తులు అమ్ముకోవాలి అనే అపోహ నేడూ ప్రజల మనస్సులో బలంగా పాతుకొని ఉంది. దానిని పొగొట్టాలంటే వారికి నిస్వార్థంగా మెరుగైన వైద్యసేవలు అందించడం ఒక్కటే మార్గం. ఆ నా వంతుగా డాక్టర్లపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కృషి చేస్తాను. వైద్యవృత్తిలో నేను నమ్మిన సిద్ధాంతాలను, విలువలను అనుసరించి నా వంతు రోగులకు సేవలు అందిస్తాను.

Updated Date - Jul 01 , 2025 | 01:33 AM