Share News

నిషేధిత జాబితా నుంచి గ్రామకంఠాలకు విముక్తి

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:08 AM

నిషేధిత జాబితా నుంచి గ్రామకంఠాలకు విముక్తి లభిస్తోంది. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌లో 630 ఎకరాలను 22ఏ నుంచి తొలగించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎకరాలను తొలగించి పేదలకు లబ్ధి కలిగించే చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు.

నిషేధిత జాబితా నుంచి గ్రామకంఠాలకు విముక్తి
కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితా నుంచి గ్రామకంఠాలకు విముక్తి లభిస్తోంది. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌లో 630 ఎకరాలను 22ఏ నుంచి తొలగించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఎకరాలను తొలగించి పేదలకు లబ్ధి కలిగించే చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వెల్లడించారు. గతంలో గ్రామకంఠంలో ఇళ్లు కట్టుకున్న భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూసదస్సుల్లో గ్రామకంఠాల్లో నివసిస్తున్న వారి నుంచి కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌లోని 192 గ్రామ కంఠాల్లో ఉన్న 630 ఎకరాలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, తహసీల్దార్లు ఆయా గ్రామాలను సందర్శించి పునఃసర్వే చేసి భూముల వివరాలను అప్‌డేట్‌ చేశారు. దీంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జేసీ శుభం బన్సల్‌ వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఆయా గ్రామాల్లోని 19వేల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఇక, వీరు ఆయా భూములపై బ్యాంకు రుణాలు పొందడంతో పాటు రిజిస్ట్రేషన్లూ చేసుకోవచ్చు. ఇలా జిల్లా వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న గ్రామకంఠాల్లోని రెండు వేల ఎకరాలకుపైగా ఉన్న భూములను 22ఏ నుంచి తొలగించి పేదలకు లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ చెప్పారు.

==============================

Updated Date - Sep 27 , 2025 | 02:08 AM