పల్లె ... స్వచ్ఛమల్లె
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:24 AM
మీ గ్రామంలో వీధులు శుభ్రంగా ఉన్నాయా? రోజూ మీ ఇంటికి చెత్తసేకరణ బండి వస్తుందా?
చిత్తూరు కలెక్టరేట్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్యం మెరుగు .... స్వచ్ఛతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ‘మీ గ్రామంలో వీధులు శుభ్రంగా ఉన్నాయా? రోజూ మీ ఇంటికి చెత్తసేకరణ బండి వస్తుందా? ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పనిచేస్తోందా? మీ ఊర్లో మురుగుకాల్వల పరిస్థితి ఏమిటి?’ అంటూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఎంపికచేసిన గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలకు ఫోన్లు వస్తున్నాయి. పల్లెల్లో పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరాపై ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ఆ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.తొలి విడతలో 150 గ్రామాలను, రెండో విడతలో 200 గ్రామాలను, మూడో విడతలో 270 గ్రామ పంచాయతీలను సర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఉత్తమంగా మూడు పంచాయతీలు
ఐవీఆర్‌ఎస్ సర్వేకు 166 గ్రామపంచాయతీలను ఎంపికచేశారు. ఈ ఏడాది మార్చి 7వ తేది నుంచి ప్రక్రియ ప్రారంభించగా, ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఉత్తమ పంచాయతీలుగా ఐరాల మండలంలోని కాణిపాకం , విజయపురం మండలంలోని జగన్నాథపురం , పాలసముద్రం మండలంలోని శ్రీకావేరిరాజపురం పంచాయతీలు నిలిచాయి. వందమంది ఇక్కడి సర్వేలో భాగస్వాములు కాగా, కాణిపాకంలో 95 శాతం, శ్రీకావేరిరాజుపురంలో 90 శాతం, జగన్నాథపురంలో 89శాతం మంది చెత్తసేకరణ బాగుందని, రక్షిత తాగునీటి సరఫరా జరుగుతోందని వందశాతం మంది చెప్పారు. నగరి మండలంలోని బుగ్గ అగ్రహారం, శ్రీరంగరాజపురం మండలంలోని శ్రీరంగరాజపురం పంచాయతీల్లో 80 శాతం బాగుందని చెప్పగా, గుడిపాల మండలం కొత్తపల్లి పంచాయతీలో 83శాతం బాగుందని చెప్పారు. కాగా కార్వేటినగరం మండలం కత్తెరపల్లి పంచాయతీలో 14 శాతం, అమ్మపల్లిలో 24 శాతం, సదుం మండలం చెరకువారిపల్లె పంచాయతీలో 25 శాతం, పులిచెర్ల మండలం దేవళంపేటలో 25 శాతం, పుంగనూరు మండలంలోని చంద్రమాకులపల్లె పంచాయతీలో 25 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన గ్రామాల్లో 40 నుంచి 60శాతం మంది చెత్తసేకరణ, నీటి సరఫరా జరుగుతోందని మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అందుబాటులో టోల్‌ఫ్రీ నెంబరు
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కార్యాలయంలో 1800 425 0017 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశాం. సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనులు చేసేలా కసరత్తు చేస్తున్నాం. ఇక్కడ గ్రీన్ అంబాసిడర్ల నియామకం, ట్రైసైకిళ్ళతో చెత్తసేకరణ పెంచేందుకు చర్యలు చేపడతాం. ఆగస్టు నెలలో సంతృప్తి శాతాన్ని 80కి పెంచుతాం.
- సుధాకర రావు, జిల్లా పంచాయతీ అధికారి