Share News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతిలో నింగి నుంచీ నిఘా

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:19 AM

తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు. భక్తులంతా తిరుపతి మీదుగానే రాకపోకలు సాగిస్తారు. ఆ రద్దీ ప్రభావం నగరంలోనూ కనిపిస్తుంది. ఈ క్రమంలో తిరుపతిలో భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతిలో నింగి నుంచీ నిఘా

10 డ్రోన్లు వినియోగించనున్న పోలీసులు

పార్కింగ్‌ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు. భక్తులంతా తిరుపతి మీదుగానే రాకపోకలు సాగిస్తారు. ఆ రద్దీ ప్రభావం నగరంలోనూ కనిపిస్తుంది. ఈ క్రమంలో తిరుపతిలో భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ భక్తవత్సలం, ఇతర పోలీసు అధికారులతో నాలుగైదు సార్లు సమావేశమయ్యారు. ఎక్కడా తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టడంపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక పది డ్రోన్లతో నింగి నుంచి తిరునగరిపై నిఘా పెట్టనున్నారు. వీటిల్లో ట్రెథర్‌ డ్రోన్‌ను బస్టాండు, రైల్వే స్టేషన్‌లో మాత్రమే వినియోగిస్తారు. మిగిలిన థర్మల్‌ డ్రోన్‌ను తిరుపతి నగరమంతా వినియోగించి ఎక్కడైనా అసాంఘిక శక్తులు తలదాచుకున్నా, తొక్కిసలాటకు ఆస్కారమున్నా పరిశీలిస్తారు. అనుక్షణం భక్తుల రాకపోకలపై డ్రోన్ల ద్వారా కమాండ్‌ కంట్రోలు యూనిట్‌ నుంచి ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇక, టీటీడీ వసతి సముదాయాలు, అలిపిరి బైపాస్‌ రోడ్డు, గరుడ, నంది సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్‌లో భక్తులు తిరగలాడే ప్రాంతాల్లో డీజేఐ 3ఎస్‌ డ్రోన్లతో పాటు హై సెక్యూరిటీ లెన్స్‌ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలిపిరి చెక్‌ పాయింట్‌, గరుడ విగ్రహం, కాలినడకన వెళ్లే భక్తుల కోసం రోప్‌ పార్టీలు, విజిలెన్సు సిబ్బంది, పోలీసులను నియమించారు.

అదనంగా ఐదు హోల్డింగ్‌ పాయింట్లు

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే వామనాలకు అదనంగా ఐదు హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. దేవలోక్‌, బాల విజ్ఞాన్‌ భవన్‌, నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండు, ఇస్కాన్‌ గ్రౌండులో పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు. ఇవి నిండిపోతే నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలను మామిడికాయల మండీ.. కడప నుంచి వచ్చే వాహనాలను శ్రీనివాస ఇంజనీరింగ్‌ కళాశాల.. చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలను చెర్లోపల్లె వద్ద ఆపాలి. ఆయా పార్కింగ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బందోబస్తు, ఫుడ్‌ స్టాళ్లు, టాయిలెట్లు తదితర వసతులను టీటీడీ సమకూరుస్తోంది.

700 మందితో భారీ బందోబస్తు

తిరుపతిలో 700 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో 10 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, మరో 300 మంది ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్లు, హోంగార్డులను బందోబస్తు కోసం నియమించారు. వీరు కాకుండా పారా మిలటరీ బలగాలు, రోప్‌ పార్టీలు, బాంబు, డాగ్‌ స్క్వాడ్లు, డిగ్గింగ్‌ పార్టీలు, మెటల్‌ డిటెక్టర్లు, లగేజీ తనిఖీ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. గరుడ సేవకు మళ్లీ అదనపు సిబ్బందిని నియమించనున్నారు.

Updated Date - Sep 23 , 2025 | 01:19 AM