విమానంలో విఘ్ననాథుడి విహారం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:05 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి విమానోత్సవం వైభవంగా జరిగింది
ఐరాల(కాణిపాకం) , సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి విమానోత్సవం వైభవంగా జరిగింది.ఐరాలకు చెందిన కేఆర్.గణపతి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురావడంతో అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను సప్పరంపై ఉంచి కాణిపాక పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు.ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, బాలాజీనాయుడు పాల్గొన్నారు.ప్రత్యేక ఉత్సవాల్లో శనివారం స్వామివారికి పుష్పపల్లకి సేవను నిర్వహించనున్నారు. పల్లకి ఏర్పాటుకు ఉభయదారులు విదేశీ పుష్పాలు కూడా తెప్పిస్తారు.ప్రధాన అలయంతో పాటు అనుబంధ ఆలయాలైన వరదరాజస్వామి , మణికంఠేశ్వర ఆలయాలను పుష్పాలతో అలంకరిస్తారు. పుష్పపల్లకి సేవను వీక్షించడానికి మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు కాణిపాకానికి విచ్చేస్తారు.